కనిపిస్తే ఖతం చేసేటోళ్లం ..ఖమేనీ కోసం ఐడీఎఫ్ తీవ్రంగా గాలించింది: ఇజ్రాయెల్

కనిపిస్తే ఖతం చేసేటోళ్లం ..ఖమేనీ కోసం ఐడీఎఫ్ తీవ్రంగా గాలించింది: ఇజ్రాయెల్

టెల్​అవీవ్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేసేందుకు తాము ప్లాన్​ చేసినట్లు ఇజ్రాయెల్​ అంగీకరించింది. ఆయన కోసం తమ సైన్యం తీవ్రంగా గాలించిందని వెల్లడించింది. ఈమేరకు ఇజ్రాయెల్​ డిఫెన్స్​ మినిస్టర్ ​కాట్జ్​  స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమేనీని అంతమొందించేందుకు తీవ్రంగా గాలించినా.. ఆయన ఆచూకీ లభించలేదని చెప్పారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో తమ ప్లాన్​ను విరమించుకున్నామని వెల్లడించారు. ‘‘బంకర్​లోకి వెళ్లిపోయాక ఖమేనీ ఆచూకీ దొరకలేదు. ఒకవేళ  మాకు కనిపించి ఉంటే.. ఆయనను బయటకు తెచ్చేవాళ్లం. ఆయన కోసం తీవ్రంగా వెదికాం. సరైన అవకాశం లభించకపోవడంతో  మేం విఫలమయ్యాం” అని తెలిపారు.

బంకర్​లో ఉన్నంత వరకే సేఫ్​..

గతేడాది తమ చేతిలో చనిపోయిన హెజ్‌‌‌‌బొల్లా చీఫ్​ హసన్​ నస్రుల్లా మాదిరిగా సుదీర్ఘకాలం బంకర్లోనే ఉండాలని తాము ఖమేనీకి సూచిస్తున్నామని కాట్జ్​  చెప్పారు. ‘‘ఖమేనీకి నా సలహా ఒక్కటే.. ఆయన ఇప్పుడు దాక్కున్నట్టు భూగర్భ బంకర్‌‌‌‌లోనే ఉండడం ఉత్తమం.. బయటికి వస్తే ప్రమాదమే’ అని కాట్జ్​ వార్నింగ్​ ఇచ్చారు. అలాగే, యుద్ధంలో అమెరికా చేరుతుందని తమకు ముందుగా తెలియదన్నారు. 

ఇరాన్​ శుద్ధి చేసిన యురేనియంను ఎక్కడ దాచిందో కూడా తమకు తెలియదని వెల్లడించారు. ఖమేనీని చంపేందుకు అమెరికా అనుమతి తీసుకున్నారా? అని మీడియా అడగ్గా.. ఇలాంటి వాటికి తమకు ఎవరి పర్మిషన్​ అక్కర్లేదని కాట్జ్ సమాధానమిచ్చారు. కాగా, ఇరాన్​లోని అణుస్థావరాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్నట్టు ఇప్పటిదాకా చెప్పిన ఇజ్రాయెల్​​.. కాట్జ్​ వ్యాఖ్యలతో ​ఇరాన్​ లీడర్​షిప్​నూ లక్ష్యంగా చేసుకొన్నట్లు  తొలిసారి అధికారికంగా ప్రకటించినట్టయింది.