గద్వాల జిల్లాలో వరుస దొంగతనాలు

గద్వాల జిల్లాలో వరుస దొంగతనాలు
  •     13 గుడుల్లో హుండీలు  చోరీ 
  •    ఒక్క కేసునూ ఛేదించని పోలీసులు 

గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లాలో దొంగలు పడుతున్నారు. రోజూ ఏదో ఒకచోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇండ్లు, షాపులు, గుడులు  అన్నీ చోట్లా చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా కేటి దొడ్డి మండల పరిధిలోని మైలగడ్డ స్టేజి దగ్గర ఉన్న ఐదు దుకాణాల్లో బుధవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. రూ. 2 లక్షల నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంటికి తాళం వేసి ఊరికి పోవాలన్నా  భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.

వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు ఒక కేసును కూడా ఛేదించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 15 రోజుల క్రితం ధరూర్ మండల కేంద్రానికి చెందిన ఓ ఇంటిలో 10 తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే మండల కేంద్రంలోని షాపుల్లో  చోరీకి పాల్పడ్డారు. మానవపాడు మండల కేంద్రంలో  పట్టపగలు ఓ ఇంట్లో  రూ.2 లక్షల క్యాష్, 2 తులాల గోల్డ్ ఎత్తుకెళ్లారు. ఇటీవల శుక్రవారం గద్వాలలోని కొత్త హౌసింగ్ బోర్డ్ కాలనీలో రెండు ఇండ్లలో దొంగతనానికి యత్నించారు. 

గుడులే టార్గట్​

జిల్లాలో ఇప్పటివరకు 13కు పైగా గుడుల్లోని హుండీలను దొంగలు ఎత్తుకెళ్లారు.  వారం రోజుల క్రితం మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ చింతల ముని రంగస్వామి దేవాలయంలో హుండీ పగలగొట్టి అందులో డబ్బులు ఎత్తుకెళ్లారు. మే 27న  నడిగడ్డ ఇలవేల్పు  జములమ్మ గుడిలోని పరుశురాముడి ఆలయంలోని హుండీని దొంగిలించారు. గట్టు మండల కేంద్రంలోని భవాని మాత గుడిలోని హుండీని, జులై 12న చిన్న ధన్వాడ విలేజ్ లోని మారెమ్మ గుడిలోని హుండీని,

రాజోలి మండలం పచ్చర్ల విలేజ్ లోని శ్రీ రేణుక ఎల్లమ్మ గుడిలోని హుండీని, ఐజ మండలం వేణు సోంపురం సంతాన వేణుగోపాలస్వామి గుడిలోని పంచలోహ విగ్రహాలను,  నరసింహ కాలనీలో ఉన్న నర్సప్ప గుడిలో వెండి విగ్రహాలను ఎత్తుకెళ్లారు.   రెండు నెలల క్రితం గద్వాల మండలం అనంతపురం విలేజ్ లో ఒకేరోజు ముని శంకర దేవాలయం, శ్రీ సీతారామ దేవాలయం, తిగలపల్లి శివాలయము, శివాంజనేయ దేవాలయంలోని హుండీలను ఎత్తుకెళ్లారు.   

ఒక్క కేసునూ ఛేదించలే

మూడు, నాలుగు నెలల నుంచి వరుసగా గుడులు, ఇండ్లను టార్గెట్ చేసి దొంగలు హుండీలను, గోల్డ్,క్యాష్ ఎత్తుకెళ్తున్నా ఇప్పటివరకు ఒక్క కేసునూకూడా పోలీసులు ఛేదించలేదు.  గుడులలో చోరీలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.   పోలీసుల నిర్లక్ష్యంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 చాలా చోట్ల సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడంతో దొంగలను పట్టుకునే  అవకాశం లేకుండా పోతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరూర్ దొంగతనం ఎంక్వయిరీలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదనే విషయం బహిర్గతమయింది. గద్వాలలో కూడా చాలా కెమెరాలు పనిచేయడం లేదు.

స్పెషల్ టీం ఏర్పాటు చేశాం

గుడుల్లో జరుగుతున్న దొంగతనాలపై స్పెషల్ టీం ఏర్పాటు చేశాం. కొన్ని కేసుల్లో పురోగతి సాధిస్తున్నాం. జైలు నుంచి విడుదలైన దొంగ చోరీలు చేస్తున్నట్లు గుర్తించాం. త్వరలోనే కొన్ని  కేసులను ఛేదిస్తాం. దొంగతనాలు జరగకుండా నిఘా పెడ్తాం.

వెంకటేశ్వర్లు డీఎస్పీ గద్వాల.