ట్రెండింగ్​ : ఒక్క నిమిషంలో .. 5 లగ్జరీ కార్లు కొట్టేశారు

ట్రెండింగ్​ :  ఒక్క నిమిషంలో .. 5 లగ్జరీ కార్లు కొట్టేశారు

వాళ్లంతా దొంగలు.. మాస్క్​లు ధరించి సైలెంట్​ గా వచ్చారు... మెల్లగా ఓ ఇంటి మెయిన్​ గేట్​ ను బద్దలు కొట్టి లోపలికి చొరబడ్డారు.. దొంగల్లో ఒకడు గేటు తెరిచి పట్టుకోగా.. మిగతా నలుగురు ఇంటి కాంపౌండ్​ లోపల నిలిపి ఉంచిన 4 లగ్జరీ కార్లను డ్రైవ్​ చేసుకుంటూ దర్జాగా తీసుకెళ్లిపోయారు. అప్పటిదాకా గేటు తెరిచి పట్టుకున్న చోరుడు కూడా.. మరో కారును తీసుకొని పరారయ్యాడు. ఇదంతా సినీ ఫక్కీలో 60 సెకన్లలోనే జరిగిందని సీసీ కెమెరా ఫుటేజీని బట్టి వెల్లడైంది. బ్రిటన్​ లోని ఎసెక్స్​ ప్రాంతంలో నవంబరు 11న  వేకువజామున చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్​ అవుతున్నాయి.  దొంగలు ఎత్తుకెళ్లిన కార్ల జాబితాలో ఏరియల్‌ ఆటమ్‌ రేసింగ్‌ కార్‌, మెర్సిడెస్‌ బెంజ్‌ ఏ45 ఏఎంజీ 4మ్యాటిక్‌, పోర్షె కెయెన్నె, పోర్షే 911 కెరేరా, మెర్సిడెస్‌ మేబాష్‌ ఉన్నాయని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్ల మొత్తం విలువ దాదాపు  రూ.7 కోట్లకుపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు ఇప్పటికే ఓ మెర్సిడెస్‌ కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మిగతా కార్లు, దుండగులను గాలించేందుకు ప్రత్యేక టీమ్​ లను రంగంలోకి దింపారు.