కరోనా టీకాలనుకొని పిల్లల వ్యాక్సిన్లు ఎత్తుకెళ్లిన్రు

కరోనా టీకాలనుకొని పిల్లల వ్యాక్సిన్లు ఎత్తుకెళ్లిన్రు

ముంబై: కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు కరోనా టీకాలు అనుకొని పిల్లలకు వేసే వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్లాస్​నగర్​ పీహెచ్​సీలో జరిగింది. ఆదివారం రాత్రి కొందరు దొంగలు బాత్రూమ్​ కిటికీని తొలగించి పీహెచ్​సీలోకి చొరబడ్డారు. ఫ్రిజ్​ను ధ్వంసం చేసి అందులో ఉన్న పిల్లలకు వేసే వివిధ టీకాల 300 వయల్స్​ను ఎత్తుకెళ్లారు. ఆ వయల్స్​ మీద సీరమ్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ ఇండియా స్టిక్కర్స్​ ఉండడంతో అవే కరోనా టీకాలు అనుకొని వాటిని దొంగిలించారు. వీరు కొవిషీల్డ్​ వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లడానికే వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సీసీటీవీ కెమెరా డీవీఆర్, మానిటర్​ను కూడా ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు సోమవారం ఉదయం పీహెచ్​సీ సిబ్బంది వచ్చి చూడగా, ఫ్రిజ్ లో ఉన్న వ్యాక్సిన్లు నేలపై చెల్లాచెదురుగా పడి ఉండడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 25 యాంటీ టీబీ వ్యాక్సిన్​ వయల్స్, 17 కాఫ్​ వయల్స్, 13 టెటానస్​వయల్స్, 15 పోలియో వయల్స్, 30 రుబెల్లా వయల్స్, 270 రోటా వైరస్​ వ్యాక్సిన్ల వయల్స్ మిస్​ అయినట్లు గుర్తించారు. పీహెచ్​సీలో కొవిడ్–19 వ్యాక్సినేషన్​ జరుగుతోందని, ప్రస్తుతం వ్యాక్సిన్​ షార్టేజ్​ వల్ల వ్యాక్సినేషన్​ను నిలిపివేశామని పీహెచ్​సీ మెడికల్​ ఆఫీసర్​ డాక్టర్​ దీపక్​ చావ్హా తెలిపారు. పీహెచ్​సీలో కొవిడ్ –19 వ్యాక్సిన్లు ఉన్నాయని భావించి వారు పీహెచ్​సీలోకి చొరబడి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.