పంచలోహ విగ్రహం కోసం పోలీసుల వేట

పంచలోహ విగ్రహం కోసం పోలీసుల వేట

గజ్వేల్, వెలుగు : సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ఉన్న స్వామివారి పురాతన పంచలోహ విగ్రహాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. వర్గల్​లో 700 ఏండ్ల నాటి వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఆలయంలోని గర్భగుడిలో రుక్మిణి, సత్యభామ సమేతుడైన వేణుగోపాలస్వామి పంచలోహ ఉత్సవ విగ్రహాలున్నాయి. వీటిలో  వేణుగోపాలస్వామి విగ్రహం సుమారు 20 కిలోల పైనే బరువుంటుంది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్​లో రూ.కోట్లలోనే ఉంటుంది. పంచలోహ విగ్రహాలను గర్భాలయంలో ప్రధాన రాతి విగ్రహాల ముందు ఉంచుతారు.

రోజు మాదిరిగానే అర్చకులు గురువారం రాత్రి 8 గంటలకు పూజలు చేసి గుడికి తాళాలు వేసి వెళ్లారు. శుక్రవారం వేకువజామునే అర్చకుడు మురళీధర్మ శర్మ పూజలు చేసేందుకు రాగా గుడి తలుపులు తెరిచి కనిపించాయి. లోపలకు వెళ్లి చూడగా వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహం కనిపించలేదు. ఆయన మిగతా అర్చకులు, కమిటీ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు చెప్పారు. గజ్వేల్ ఏసీపీ రమేశ్, రూరల్​సీఐ రాజశేఖరరెడ్డి, గౌరారం ఎస్సై సంపత్​కుమార్​  వచ్చి విచారణ చేపట్టారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించాయి.   బయటి వ్యక్తులతో పాటు స్థానికుల సహకారంతోనే విగ్రహం అపహరణకు గురై ఉండవచ్చని ఏసీపీ రమేశ్​ తెలిపారు.