సన్న బియ్యం రేట్లు భారీగా పెంచిన మిల్లర్లు

సన్న బియ్యం రేట్లు భారీగా పెంచిన మిల్లర్లు
  • సన్న బియ్యం రేట్లు పెంచిన్రు!
  • క్వింటాల్​కు రూ.400 దాక పెంచిన మిల్లర్లు
  • వానకాలం అడ్డికి పావుశేరు కొన్న వ్యాపారులు
  • అప్పట్లో మద్దతు ధర లేక మునిగిన రైతులు
  • ఇప్పుడు పెరిగిన రేట్లతో పబ్లిక్ సఫర్


కరీంనగర్​/మిర్యాలగూడ, వెలుగు: మిల్లర్ల మాయాజాలానికి అటు రైతులు, ఇటు సామాన్య ప్రజలు మోసపోతున్నారు. నిరుడు వానకాలం సన్నవడ్లను అడ్డికి పావుశేరు కొన్న వ్యాపారులు, ఇప్పుడు కరోనా టైం చూసి బియ్యం రేట్లను అమాంతం పెంచేశారు. అన్ని రకాల సన్నబియ్యాన్ని క్వింటాల్​కు రూ.200 నుంచి రూ.400 వరకు పెంచి మార్కెట్​లోకి వదులుతున్నారు. ఆ రేట్లపై యాభయ్యో, వందో చూసుకొని రిటైల్​వ్యాపారులు అమ్ముకుంటున్నారు. మిల్లర్లు రైతుల వద్ద వడ్లను మద్దతు ధరకంటే తక్కువకు కొన్నప్పుడు ఏమీ చేయలేకపోయిన సర్కారు, ఇప్పుడు బియ్యం రేట్లను పెంచినా పట్టించుకోవడం లేదు. వానకాలం సన్నవడ్లు బాగా పండాయని, ఈసారి రేట్లు తగ్గుతాయని అనుకుంటున్న టైంలో అనూహ్యంగా పెరిగిన రేట్లను చూసి సామాన్యులు పరేషాన్ అవుతున్నారు.

వానకాలం మద్దతు ధర పెట్టలే..
గత వానకాలం సీజన్​లో రైతులు స్టేట్​వైడ్​ సుమారు 24 లక్షల ఎకరాల్లో బీపీటీ, తెలంగాణ మసూరి లాంటి సన్నరకాలు వేశారు. కేంద్ర ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 1,888 కనీస మద్దతు ధర ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు తాము సన్నవడ్లు వేశామని, అందువల్ల క్వింటాల్​కు రూ.2,500 చొప్పున చెల్లించి కొనాలని అప్పట్లో రైతులు డిమాండ్​ చేశారు. వందో, నూటయాభై వరకో పెంచి ఇస్తామని  సీఎం కేసీఆర్​ కూడా హామీ ఇచ్చారు. కానీ సర్కారు ఇవ్వలేదు. అదే టైంలో ఐకేపీ సెంటర్లు, మార్కెట్​యార్డుల్లో సన్నవడ్లను కొనకపోవడంతో రైతులు మిల్లర్లను ఆశ్రయించారు. ఇదే అదనుగా తప్ప, తాలు, తేమ సాకుతో వ్యాపారులు క్వింటాల్​కు రూ.1,600 నుంచి రూ.1,700 వరకు మాత్రమే చెల్లించారు. అప్పట్లో తమకు జరిగిన అన్యాయంపై రైతులు మొత్తుకున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. తీరా వడ్లన్నీ రైసుమిల్లులకు చేరాక వ్యాపారులు, కరోనా టైం చూసి ఇప్పుడు బియ్యం రేట్లు పెంచేశారు.

సామాన్యులపై భారం


అప్పుడు తక్కువ ధరలకు సన్నవడ్లను కొనుగోలు చేసి రైతుల శ్రమను దోచుకున్న మిల్లర్లు ఇప్పుడు సన్న బియ్యం రేట్లు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం వారం, పదిరోజుల క్రితమే రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లు సన్న బియ్యం ధరలను  క్వింటాల్​కు రూ. 200 నుంచి రూ.400 వరకు పెంచినట్లు రిటైల్​ వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటి వరకు కరీంనగర్​లో  జై శ్రీరామ్ రకం సన్నబియ్యం  క్వింటాల్​రూ. 5,400,  హెచ్ఎంటీ రకం రూ. 4,600 కు అమ్మారు. కానీ గడిచిన పది రోజుల్లోనే జై శ్రీరామ్ రకం బియ్యాన్ని రూ.5,800 - నుంచి రూ.6 వేల వరకు, హెచ్ఎంటీ రకం బియ్యాన్ని రూ. 5వేల నుంచి 5,200 వరకు అమ్ముతున్నారు. రెండువారాల కింద నల్గొండ జిల్లాలో బీపీటీ రకం బియ్యాన్ని క్వింటాల్​ కు రూ.4,800, హెచ్ఎంటీ రకం బియ్యాన్ని రూ.4,600 వరకు, చింట్లను 4 వేలకు అమ్మారు. ఇప్పుడు బీపీటీ రూ.5,200, హెచ్​ఎంటీ రూ.5వేలు, చింట్లు రకం బియ్యాన్ని రూ.4,400 చొప్పున విక్రయిస్తున్నారు.  దీంతో నెల రోజుల క్రితం బియ్యం కొన్నవాళ్లంతా ఇప్పుడు బియ్యం దుకాణాలకు పోయి పరేషాన్​ అవుతున్నారు. గత వానకాలం సీజన్​లో సన్నవడ్లు బాగా పండినందున ఈసారి రేట్లు తగ్గుతాయని భావించామనీ, తీరా పెరగడంతో నిరాశ చెందామని పబ్లిక్​ 
అంటున్నారు.

సర్కారు ఏం చేస్తోంది?
గత వానకాలం రైతుల దగ్గర  సన్నవడ్లను మిల్లర్లు తక్కువ ధరలకే కొన్నరు. వాళ్ల చేతులకు వడ్లు పోయినంక రేట్లు పెంచిన్రు. వడ్లు ఎక్కువ పండితే తక్కువ ధర ఉండాలె కదా? కానీ రేట్లు పెంచిన్రు. నెల కిందటికి, ఇప్పటికి సన్నబియ్యం రూ.400 దాక పెరిగినయ్. మిల్లర్లు ఇష్టమున్నట్లు రేట్లు పెంచితే సర్కారు, ఆఫీసర్లు ఏం చేస్తున్నరు. రేట్లు తగ్గేలా చర్యలు తీసుకోవాలె.
- సత్యనారాయణ, ప్రైవేట్ ఉద్యోగి

కరోనా టైంల రేట్లు పెంచిన్రు
అసలే కరోనాతోని సామాన్యులు మస్తు సఫర్​అయితన్రు. పనులు లేక, చేతుల పైసలు లేక దినదిన గండంగా బతుకుతన్రు. గిసొంటి టైంలో వ్యాపారులు బియ్యం రేట్లు పెంచడం న్యాయం కాదు. కరోనా టైంలో రేట్లు పెంచకుండా  చర్యలు తీసుకోవాలె. 
- బట్టు సుధాకర్, కరీంనగర్

 పరిశీలించి చర్యలు తీసుకుంటం
రైస్​మిల్లర్లు బియ్యం ధరలు పెంచినట్లు నా దృష్టికి రాలేదు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటం. సర్కారు రూల్స్​మేరకు రేట్ల పెంపు, ఇతర అంశాలను గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
- సివిల్​సప్లై డీటీ రామకృష్ణారెడ్డి, మిర్యాలగూడ