మట్టి పాత్రలు.. మోడ్రన్ ట్రెండ్!

మట్టి పాత్రలు.. మోడ్రన్ ట్రెండ్!

పాతకాలం నాటి కుండలు, అటికెలు, చిప్పలు.. ఇప్పుడు ప్రతి వంటింట్లో కనపడుతున్నాయి. అదేంటి? అని అడిగితే..
ఆరోగ్యం అంటున్నారు. నిజమే మరి. ఎటువంటి హాని చేయని మట్టి పాత్రలు అందరి ఇళ్లల్లో చేరుతున్నాయి. ఇలాంటి
ట్రెండ్ కరీంనగర్‌‌‌‌లోనూ కనిపిస్తోంది. మట్టి పాత్రల్లో వెరైటీలను పరిచయం చేస్తున్నారు వ్యాపారులు.

కరీంనగర్‌, వెలుగు : నేటి తరంలో చాలా మందికి కొన్ని వస్తువుల గురించి చెబితే అర్థం కాదు. ఎందుకంటే వాటిని ఎలా వాడాలో తెలియదు కాబట్టి. అదే నలభై, యాభై ఏళ్ల కిత్రం వాళ్లను అడిగితే టక్కున చెప్పేస్తారు. ఇప్పుడు పాత వస్తువులే.. కొత్త రంగులద్దుకొని మార్కెట్లోకి వస్తున్నాయి. అలాంటి పనే చేస్తున్నాడు కరీంనగర్​కు చెందిన మొగిలి. ఈయన కుమ్మరి కాదు. శాలివాహన కులస్తుడు. అందరిలా కాకుండా, వ్యాపార రంగంలో వస్తున్న మార్పులు తెలుసుకునేవాడు. ప్రజలు ఎలాంటి వస్తువులు కోరుకుంటున్నారు?  వారి అభిరుచులు ఏమిటి? ఎలాంటి ఉత్పత్తులు అందించాలి? అనే విషయాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు.  కరీంనగర్‌‌‌‌లో ఎంతో మంది కుండలు విక్రయించేవారు ఉన్నారు. కానీ మొగిలి అలా కాదు. చేసే పనిలో సంతృప్తిని వెతుక్కుంటాడు. కొనేవారి ముఖంలో ఆనందం కోసం పాకులాడుతాడు. అందుకే సీజన్ల వారీగా కొత్త రకాలతో మార్కెట్లోకి వస్తాడు. భిన్నమైన వస్తువులను అమ్ముతాడు.

భలే డిమాండ్​

ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా.. స్టీల్‌‌‌‌ పాత్రలే కనిపిస్తున్నాయి. లేదంటే ప్లాస్టిక్‌‌‌‌.. సిరామిక్‌‌‌‌. కానీ అప్పట్లో ఇవేవీ లేవు. మట్టితో తయారు చేసిన కుండలు, అటికెలు (చిన్న పాత్రలు) మాత్రమే ఉండేవి. అన్నం వండాలన్నా.. కూర చేయాలన్నా అటికెలకే ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు. చాలామందికి స్టీలు, ఇత్తడి పాత్రల్లో వంటలు చేసుకొని తినడం బోర్‌‌‌‌ కొట్టింది. తిరిగి ప్రకృతి ప్రసాదించిన మట్టి పాత్రల వైపే మొగ్గు చూపుతున్నారు. కుండల్లో అన్నం వండుకోకున్నా… అటికెలు లాంటి పాత్రల్లో కూరలు వండటం బెటర్​ అనుకుంటున్నారు. అందుకే మొగిలి డిమాండ్​ను, ఆరోగ్య సూత్రాల్ని గమనించి అమ్మడం ప్రారంభించాడు. మట్టితో చేసిన పాత్రలు.. నీళ్లు తాగేందుకు వాడే మట్టి సీసాలు.. మట్టి కుక్కర్లు అమ్ముతున్నాడు. వీటికి భలే డిమాండు ఉంటుంది.  ప్రతి  ఎండాకాలంలో ఆదిలాబాద్ రంజన్లతో పాటు.. రాజస్తాన్‌‌‌‌ రంజన్లను తీసుకువచ్చి అమ్ముతున్నాడు.

అన్ని రకాల పాత్రలు

మొగిలి దుకాణంతో పాటు ఇటీవల కరీంనగర్‍లోని సర్కస్‍ మైదానంలో ఏర్పాటు చేసిన మేళాలో మట్టితో తయారు చేసిన చాలా రకాల వస్తువులను అమ్ముతున్నారు. అది కూడా తక్కువ ధరలకే. ఇంట్లో నీళ్లు తాగడానికి ఉపయోగించే గ్లాసుల దగ్గర నుంచి చిన్న చిన్న పాత్రలు.. మీడియం, పెద్ద సైజ్‍ గ్లాసులు ఉన్నాయి.  బాటిళ్లు.. కుక్కర్లు.. కూడా  అమ్ముతున్నారు.  కలుషితం లేని పాత్రల్లో నీళ్లు తాగడం, వంటలు చేసుకోవడం.. చాయ్ తాగడం లాంటి అవసరాలకు ఉపయోగిస్తున్నామని అంటున్నారు గృహిణులు.

వెరైటీవి అమ్మడమే ఇష్టం

మొదటి నుంచి కూడా అందరికంటే విభిన్నమైన వస్తువులను అమ్మడం ఇష్టం. నా దగ్గర పెళ్లిళ్లకు ఉపయోగించే కుండను అందంగా తీర్చిదిద్దుతా. ఇలాంటివి ఎక్కడా దొరకవు. పాతకాలం నాటి మట్టి పాత్రలు  కోరుతున్నారు. అందుకే ప్రస్తుత జనరేషన్‌‌‌‌ కు తగినట్లుగా ఆకర్షణీయంగా తయారుచేస్తా. ఇందులోనే నాకు తృప్తి ఉంది.

– మొగిలి, కరీంనగర్‌‌‌‌