ఈ నెల 31లోగా అర్జెంటుగా చేయాల్సిన పనులివి! మీరు చేశారా?

ఈ నెల 31లోగా అర్జెంటుగా చేయాల్సిన పనులివి! మీరు చేశారా?
  • అర్జెంటుగా చేయాల్సిన పనులివి!
  • ఈ నెల 31 వరకే గడువు

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: మరికొన్ని రోజుల్లో 2021 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈలోపు కొన్ని పనులను తప్పక ముగించాలి. శాలరీడ్‌‌ ఎంప్లాయీస్‌‌ కంపెనీ మారితే ఇది వరకటి ఎంప్లాయర్‌‌ వివరాలను 12బి ఫారం ద్వారా ప్రస్తుత కంపెనీకి అందజేయాలి. దీనివల్ల పన్ను మినహాయింపులకు సంబంధించిన ఇబ్బందులు ఉండవు. లేకపోతే భారీగా పన్ను కట్టాల్సి ఉంటుంది. ఐటీఆర్‌‌ సబ్‌‌మిట్‌‌చేయాల్సిన సమయంలో ఈ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కో కంపెనీలో ఒక్కో రకమైన బెనిఫిట్స్‌‌, డిడక్షన్స్‌‌ ఉంటాయి కాబట్టి అన్ని వివరాలను కొత్త కంపెనీకి అందజేస్తే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. 

ఖర్చుల వివరాలనూ ఇవ్వాలి

చాలా ఖర్చులకు పన్ను మినహాయింపులు పొందవచ్చు.  హెచ్​ఆర్​ఏ, ఎల్‌‌టీఏకు సంబంధించిన రశీదులను  ఎంప్లాయీస్‌‌ తప్పక సబ్‌‌మిట్‌‌ చేయాలి. లేకపోతే వీటిపై పన్నుపోటు ఉంటుంది.  ఎంప్లాయర్‌‌ వీటిని ట్యాక్సబుల్‌‌ అలవెన్సులుగా లెక్కిస్తాడు. రశీదులను అందజేయడం ఇప్పుడు సాధ్యం కాకుంటే,  ఐటీఆర్‌‌ ఫైలింగ్‌‌ సమయంలోనైనా ఇచ్చి రీఫండ్‌‌ పొందవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గత ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్‌‌ ఫైల్‌‌ చేయకుంటే, పెనాల్టీ కట్టి ఈ నెలాఖరులోపు ఫైల్‌‌ చేయొచ్చు. 

బ్యాంకు రికార్డులను సరిచూసుకోండి

ఇన్సూరెన్స్‌‌ ,  ఎస్‌‌ఐపీ, హోంలోన్‌‌కు పన్ను మినహాయింపులు ఉంటాయి. ఇలాంటి వాటి ఈఎంఐలకు చాలా మంది ఈసీఎస్‌‌ డెబిట్‌‌ సదుపాయాన్ని వాడుకుంటారు. అంటే ప్రతి నెలా మన అకౌంట్‌‌ నుంచి డబ్బు కట్‌‌ అవుతుంది. కొన్నిసార్లు  పొరపాటున కట్‌‌ కాకపోవచ్చు. ఆ తర్వాత  మనం చెక్కు ఇచ్చినా పని జరక్కపోవచ్చు. అందుకే, ఇలాంటి వివరాలన్నింటినీ సరిచూసుకోవాలి. పన్ను మినహాయింపు పొందగల మొత్తాలన్నీ మీ ఖాతా నుంచి డెబిట్‌‌ అయ్యేలా చూసుకోవాలి. లేకపోతే పన్ను మినహాయింపు పొందగల ఏదైనా ప్రొడక్టు కొనాలి.

అడ్వాన్స్‌‌ ట్యాక్స్‌‌ పేమెంట్‌‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సోర్స్‌‌ (మూలం) వద్ద పన్నును వసూలు చేశాక  కూడా నికర పన్ను చెల్లింపు బాధ్యత రూ.10 వేలు దాటితే  అడ్వాన్స్‌‌ ట్యాక్స్‌‌పేమెంట్‌‌ చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు విడతల్లో ఈ మొత్తాన్ని కట్టాలి. ఒకవేళ ఇప్పటిదాకా కట్టడం మర్చిపోతే ఈ నెలాఖరులోపు ఒకేసారి చెల్లించవచ్చు. ఎలాంటి బిజినెస్‌‌ లేదా ప్రొఫెషన్‌‌ లేని సీనియర్‌‌ సిటిజన్లు మాత్రం అడ్వాన్స్‌‌ ట్యాక్స్‌‌ కట్టాల్సిన అవసరం లేదు.రెంట్‌‌, వడ్డీ, క్యాపిటల్‌‌ గెయిన్స్‌‌, డివిడెండ్​ వంటి ఆదాయాలు వస్తే శాలరీ నుంచి పన్నును వసూలు చేసిన తర్వాత కూడా ఆ ఉద్యోగి అడ్వాన్స్‌‌ ట్యాక్స్‌‌ కట్టాలి. 

పీపీఎఫ్‌‌,ఎన్‌‌పీఎస్‌‌ ఖాతాలు

మీ పేరిట లేదా, మీ కుటుంబీకుల పేరిట పీపీఎఫ్​ ఖాతా ఉంటే ఏటా కనీసం రూ.500 చెల్లించకపోతే ఆ ఖాతా మూతబడుతుంది. ఇలా మూతబడ్డ ఖాతాలో రూ.500 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం వేస్తే ఖాతా మళ్లీ యాక్టివేట్‌‌ అవుతుంది.నేషనల్‌‌ పెన్షన్‌‌ స్కీమ్‌‌ (ఎన్‌‌పీఎస్‌‌) ఖాతాకూ ఇవే రూల్స్ వర్తిస్తాయి. అంటే ఖాతా పనిచేయకున్నా, రూ.500 డిపాజిట్‌‌ చేస్తే రీయాక్టివేట్‌‌ అవుతుంది. 

క్యాపిటల్‌‌ గెయిన్స్‌‌

లిస్టెడ్‌‌ ఈక్విటీ షేర్స్‌‌, ఈక్విటీ స్కీమ్స్‌‌పై వచ్చే లాంగ్‌‌టర్మ్‌‌ క్యాపిటల్‌‌ గెయిన్స్‌‌ రూ.లక్ష లోపు ఉంటే 112ఏ సెక్షన్‌‌ ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చు. రూ.లక్ష తరువాతి మొత్తంపై 10 శాతం పన్ను కట్టాలి. ఈ నెలాఖరులోపు రూ.లక్ష వరకు క్యాపిటల్‌‌ గెయిన్స్‌‌ను బుక్‌‌ చేసుకోవచ్చు. లాంగ్‌‌టర్మ్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ అయితే మార్చి 31నాడు అమ్మేసి, మరునాడు తిరిగి  కొనుక్కోవచ్చు.