కల్వకుంట్ల కుటుంబ పాలన పోతేనే ప్రజల కండ్లల్లో సంతోషం

కల్వకుంట్ల  కుటుంబ పాలన పోతేనే ప్రజల కండ్లల్లో సంతోషం

భూపాలపల్లి అర్భన్, వెలుగు: రాష్ట్రానికి శనిలా దాపురించిన కుటుంబ పాలన పోతేనే ప్రజల కండ్లల్లో సంతోషం నిండుతుందని తీన్మార్ ​మల్లన్న అన్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా గురువారం సాయంత్రం ఆయన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రోడ్​షో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. కేసీఆర్ తో మొదలైన కుటుంబ పాలన నేడు 7,200 మంది అవినీతి పరుల సహకారంతో కొనసాగుతోందని విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కుతో చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నది చాలక.. బీఆర్ఎస్​పేరుతో దేశాన్ని దోచుకోవడానికి కేసీఆర్ కుటుంబం బయలుదేరిందని ఆరోపించారు. భూపాలపల్లి జిల్లాలో వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరి ప్రయోజనం కోసమో సీఎం వివరించాలని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి ఏర్పాటు చేసిన పంపులు కొద్దిపాటి వానలకే దెబ్బతిన్నాయని మండిపడ్డారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ప్రకటించకపోవడం వెనకున్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆయన వెంట టీం సభ్యులు దాసరి భూమయ్య, రవి పటేల్, రమేశ్​ తదితరులు ఉన్నారు.