
- కాజీపేట రైల్వే మిక్స్డ్ స్కూల్ ల్యాండ్ కేటాయింపు
- మాటిచ్చి 10 ఏండ్లు పట్టించుకోని కేసీఆర్ సర్కార్
- కాంగ్రెస్ లీడర్ల చొరవతో 45 ఏండ్ల కల సాకారం
- సీఎం పర్యటనలో పనులకు శంకుస్థాపన
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ పరిధిలో ఇప్పటివరకు రెండు బస్టాండ్‍లు ఉండగా.. కాజీపేటలో మూడవ బస్టాండ్ రాబోతోంది. 45 ఏండ్లుగా ఏ ఎన్నికలొచ్చినా కాజీపేట బస్టాండ్ ఏర్పాటు చేస్తామని హామీఇస్తూ చాలామంది లీడర్లు ప్రజాప్రతినిధులుగా ఎదిగారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ చొరవతో బస్టాండ్ నిర్మాణానికి భూములు ఇవ్వడానికి రైల్వే శాఖ అంగీకరించింది. దీంతో కాజీపేటవాసుల కల నిజం కాబోతోంది. సీఎం రేవంత్‍రెడ్డి వరంగల్ పర్యటనకొచ్చినప్పుడు శంకుస్థాపన చేయనున్నారు.
కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన మాట తప్పారు..
ట్రైసిటీ పరిధిలోని వరంగల్, హనుమకొండల్లో దాదాపు 50 ఏండ్ల కిందటి నుంచే బస్టాండ్లు, బస్ డిపోలు ఉన్నాయి. కాజీపేటలో మాత్రం ఇప్పటికీ బస్టాండ్ నిర్మించలేదు. కాజిపేట రైల్వేస్టేషన్ ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలిపే జంక్షన్ ఉండగా అనేక ప్రాంతాలనుంచి రైళ్లో వచ్చే ప్రయాణికులు తమ గమ్యాలకు వెళ్లాలంటే 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమకొండ బస్టాండుకు వెళ్లాల్సివస్తోంది. కాజీపేట బస్టాండ్ కోసం 1990 నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ కాజీపేట బస్టాండ్ నినాదంతో రాజకీయాల్లో అడుగుపెట్టి నిరహార దీక్షలు చేశారు. 1994లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు.
1999లో ప్రణయ్ భాస్కర్ మరణం తర్వాత ఆయన సోదరుడు దాస్యం వినయ్ భాస్కర్ అదే నినాదాన్ని అందుకున్నారు. 2009, 2010 ఉప ఎన్నికల్లో గెలిచారు. సమైక్యపాలనలో అన్యాయం జరిగిందన్న విజయ్ బాస్కర్తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014, 2018 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచినా ఈ విషయంలో చొరవ చూపలేదు. కేసీఆర్, కేటీఆర్ వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడల్లా కాజీపేట బస్టాండ్ హామీ ఇచ్చినా అది ఆచరణలోకి రాలేదు.
రైల్వే స్కూల్ ల్యాండ్‍లో బస్టాండ్
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్ని పార్టీలు కాజీపేట బస్టాండ్ గురించి హామీ ఇచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య ఈ అంశాన్ని సీఎం రేవంత్‍రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. బస్టాండ్ కోసం రైల్వే భూములు అనువుగా ఉంటాయని గుర్తించి.. భూముల సాధనపై దృష్టి పెట్టారు. జనవరి 28న ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, ఎంపీ కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంను కలిసి కూడా రైల్వే భూములను ఇవ్వాలని కోరారు.
రైల్వే ఏడీఆర్ఎం గోపాల్ బృందం కాజీపేటకు వచ్చి అందుబాటులో ఉన్న మూడు స్థలాలను పరిశీలించింది. హైదరాబాద్ రోడ్డులోని రైల్వే ఇంగ్లీష్ స్కూల్ కు చెందిన ఎకరంన్నర స్థలంలో కాజీపేట బస్టాండ్ నిర్మించాలని నిర్ణయించారు. స్కూలు స్థలానికి బదులు మరోచోట రైల్వే శాఖకు భూమి ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. రైల్వేకు మడికొండలోని 1296 సర్వే నంబర్‍లో ఉన్న సీలింగ్ భూమిని ఇవ్వడానికి సిద్ధమయ్యారు.