
- ఉదయం 9:17 గంటలకు నింగికెగిరిన రాకెట్
- రెండు ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యలోకి చేర్చిందన్న ఇస్రో
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. దేశీయంగా రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ) ద్వారా రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చింది. శుక్రవారం ఉదయం 9:17 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికెగిరింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్(ఈఓఎస్–08) తో పాటు ఎస్ఆర్–0 డెమోశాట్ ఉపగ్రహాన్ని నిర్దిష్ట కక్ష్య లోకి చేర్చింది.
రాకెట్ ప్రయోగం విజయవంతమైందని, ఉపగ్రహాలు రెండూ లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో తమ ప్రయాణాన్ని ప్రారంభించాయని ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్ నాథ్ ప్రకటించారు. ఉపగ్రహాల ప్రయాణం నిర్దేశిత మార్గంలోనే సాగుతోందని వెల్లడించారు. లాంచింగ్ వెహికల్(ఎల్వీ) రూపకల్పనలో ఇస్రో నేడు చరిత్ర సృష్టించిందని ఎస్ఎస్ఎల్వీ డి3 మిషన్ డైరెక్టర్ ఎస్ఎస్ వినోద్ పేర్కొన్నారు. చిన్న రాకెట్ల తయారీలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎస్ఎస్ఎల్వీ రూపకల్పనలో చివరి ప్రయోగ దశను విజయవంతంగా పూర్తిచేశామని చెప్పారు.
2022లో తొలి ప్రయోగం..
ఎస్ఎస్ఎల్వీని ఇస్రో తొలిసారిగా 2022లో ప్రయోగించింది. దురదృష్టవశాత్తూ ఆ మిషన్ ఫెయిల్ అయింది. రెండోసారి 2023 ఫిబ్రవరిలో విజయవంతంగా పరీక్షించింది. శుక్రవారం మూడోసారి ఈఓఎస్–08 శాటిలైట్ ద్వారా ఏకంగా 21 కొత్త టెక్నా లజీలను పరీక్షించాలని సైంటిస్టులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. అంతరిక్షంలో సూర్యుడి నుంచి వచ్చే కాంతిలో ఎంతమొత్తం యూవీ లైట్ శాటిలైట్ పై పడుతుందనేది కచ్చితంగా తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. శాటిలైట్‌లో అమర్చిన పరికరం సమర్థంగా పనిచేస్తే ఇస్రో భవిష్యత్తులో చేపట్టబోయే మిషన్లలో ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు.
డిసెంబర్లో గగన్ యాన్
గగన్ యాన్ ప్రాజెక్ట్ లో భాగంగా తొలి మిషన్ ను ఈ ఏడాది డిసెబంర్లో చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ శుక్రవారం వెల్లడించారు. జీ1 గా వ్యవహరించే ఈ మిషన్ కు సంబంధించిన రాకెట్ హార్డ్ వేర్, క్రూ మాడ్యుల్ ఇంటిగ్రేషన్, క్రూ ఎస్కేప్ హార్డ్ వేర్ ను స్టడీ చేస్తున్నట్లు వివరించారు. త్రివేండ్రంతో పాటు వివిధ ప్రదేశాలలో తయారవుతున్న రాకెట్ పార్టులు నవంబర్ కల్లా షార్కు చేరుతాయని, డిసెంబర్లో తొలి మానవరహిత ప్రయోగం చేపడతామని సోమ్‌నాథ్ చెప్పారు.