ఈ నెల 27న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ

 ఈ నెల 27న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ
  • చీఫ్ గెస్టుగా జేపీ నడ్డా
  • కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే యాత్ర.. లేదంటే ముగింపు సభ
  • జన సమీకరణపై నేతలతో పార్టీ స్టేట్ చీఫ్ సంజయ్ సమావేశం

హైదరాబాద్, కరీంనగర్, వెలుగు: మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఈ నెల 27న హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. సభకు చీఫ్ గెస్టుగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పాదయాత్ర కొనసాగడంపై హైకోర్టు తీర్పు ఎలా వచ్చినా.. బహిరంగ సభ మాత్రం యథావిధిగా నిర్వహించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే బుధవారం కరీంనగర్ లో ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అధ్యక్షతన ఉత్తర తెలంగాణ జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్​చార్జ్​లు, ముఖ్య నేతల సమావేశం జరిగింది. వరంగల్ సభకు భారీ జన సమీకరణపై ప్రధానంగా చర్చించారు. పాదయాత్రపై కోర్టు తీర్పు గురువారం వెలువడనుంది. తీర్పు అనుకూలంగా వస్తే మూడ్రోజుల యాత్ర కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం కాకుండా పాదయాత్ర దూరం తగించి స్టేషన్ ఘన్​పూర్ నుంచి నేరుగా వరంగల్ వెళ్లేలా రూట్ ను ఖరారు చేస్తున్నారు. యాత్రకు కోర్టు అనుమతి నిరాకరిస్తే డివిజన్ బెంచ్ కు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. యాత్రకు అనుమతి లేకున్నా సభను నిర్వహిస్తామని బీజేపీ నాయకులు అంటున్నారు.

శాంతి భద్రతలపై కేసీఆర్ సమీక్ష విడ్డూరం

శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనుకుంటున్న సీఎం కేసీఆర్ వాటిపై సమీక్ష  నిర్వహించడం విడ్డూరంగా ఉందని సంజయ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి రావడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ అధికారంలోకి రావాలంటే మునుగోడు ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనని, అందుకు ప్రతీ  కార్యకర్త మునుగోడులో ఇంటింటికి తిరిగి బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. పాదయాత్ర ముగింపు సభను సక్సెస్ చేసి తీరుతామన్నారు. కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి, బంగారు శృతి, దుగ్యాల ప్రదీప్ కుమార్, విఠల్, రవీంద్ర నాయక్, బొడిగె శోభ, విజయరామరావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నందీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.