పవన్ కళ్యాణ్‌‌‌‌కు మాత్రమే సరిపోయే కథ ఇది

పవన్ కళ్యాణ్‌‌‌‌కు మాత్రమే సరిపోయే కథ ఇది

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్ హీరోయిన్. క్రిష్​, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌‌‌‌‌‌‌‌ రావు నిర్మించారు.  జూన్ 12న సినిమా విడుదల కానుంది.  బుధవారం (May 12) ‘అసుర హననం’ అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ ‘మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్‌‌‌‌.

ఆయనకు మాత్రమే సరిపోయేలా తీర్చిదిద్దిన కథ ఇది.  జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోయే కార్చిచ్చు పవన్. అలాంటి వ్యక్తి  సినిమాకు ఫస్ట్ టైమ్ వర్క్ చేస్తుండడంతో శ్రద్ధగా వర్క్ చేశాం. ఇది మూడో పాట.  మరో మూడు పాటల తర్వాత ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేస్తాం. ‘తార తార’ అనే ఓ ఐటెం సాంగ్‌‌‌‌లో  పవన్‌‌‌‌ కళ్యాణ్​ గారిని ఉద్దేశించి కొన్ని లిరిక్స్ రాయగా.. బాధ్యతగల హోదాలో ఉన్న వ్యక్తిగా ఆయన వాటిని మార్చమని చెప్పారు.  

ఆయన నిబద్ధతకు ఇది నిదర్శనం’ అన్నారు.  దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ ‘క్రిష్ గారు ఈ సినిమాకు స్ట్రాంగ్‌‌‌‌ ఫౌండేషన్ వేశారు. ఒలింపిక్ టార్చ్‌‌‌‌ను అందించినట్టుగా ఇంత పెద్ద బాధ్యతను నాకు అందించారు.  ఈ పాటలోని యాక్షన్ సీన్స్‌‌‌‌కు పవన్ కళ్యాణ్ గారే  కొరియోగ్రఫీ చేశారు.  ఆయన ఎంతో ప్యాషన్‌‌‌‌తో చేసిన ఫైట్స్‌‌‌‌కు తగ్గట్టుగా కీరవాణి గారు అద్భుతమైన సాంగ్ ఇచ్చారు.

ఖడ్గానికి, ధర్మానికి మధ్య జరిగే కథ ఇది. అందుకే ఫస్ట్ పార్ట్‌‌‌‌కు స్వార్డ్‌‌‌‌ వర్సెస్‌‌‌‌ స్పిరిట్‌‌‌‌ అనే క్యాప్షన్ ఇచ్చాం.  ధర్మానికి ప్రతినిధిగా పవన్ కళ్యాణ్, ఖడ్గానికి ప్రతీకగా బాబీడియోల్ కనిపిస్తారు’ అని చెప్పాడు. ‘సినిమా అద్భుతంగా వచ్చింది. తెలుగుతోపాటు అన్ని భాషల్లో విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’ అని ఎ.ఎం.రత్నం అన్నారు.  పవన్ కళ్యాణ్‌‌‌‌తో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని నిధి అగర్వాల్ చెప్పింది.  నిర్మాత ఎ. దయాకరరావు, నటుడు రఘుబాబు, గీత రచయిత రాంబాబు గోసాల సహా టీమ్ పాల్గొన్నారు.