ఇదే నా మొదటి ప్రేమలేఖ..

ఇదే నా మొదటి ప్రేమలేఖ..

రాయాలి ఓ ప్రేమలేఖ

లవ్ ప్రపోజల్, బ్రేకప్ ఏదైనా సరే నాలుగు పదాల్లో లేదా ఒక్క ఎస్సెమ్మెస్, లేదంటే వాట్సాప్ లో జరిగిపోతున్న రోజులివి. ప్రేమని చెప్పడం, ప్రేమ ఇక చాలని తేల్చెయ్యటం వేలికొనలమీద పని.  కానీ ఒకప్పుడు ప్రేమలేఖ ఉండేది. టకటకా కొట్టుకుంటున్న గుండె చప్పుడుకి సమానంగా ఆ ఫీలింగ్ ని ఎక్స్‌‌ప్రెసివ్ గా చెప్పుకున్న రోజులుండేవి. సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ వచ్చాక అంతా ఇన్ స్టంట్ అయిపోయింది గానీ…  ఒక ప్రేమ లేఖ రాయటం అంటే గడిచిన జీవితం నుంచి  ఫ్యూచర్ దాకా మనజీవితానికి మనం చేసుకునే ప్రామిస్ అంటాడు మార్క్ ట్వెయిన్. తమలపాకు మీద దమయంతి రాసిన ప్రేమలేఖ, హంస రాయబారం ఇప్పటి తరానికి కేవలం కథ మాత్రమే… కానీ లవ్ లెటర్ ఎప్పటికీ కొత్తగా ఉండే నోస్టాల్జియా…

ప్రేమలేఖ అంటే

ఎస్సెమ్మెస్, కాల్, వీడియో చాట్ అంటూ ఇంత అప్‌‌డేట్ అయ్యాక మనలో ఉండే హ్యూమన్ ఎమోషన్స్ చాలావరకూ తగ్గిపోయాయి. ఎవరికైనా కాల్ చేయాలంటే జస్ట్ అలా నెంబర్ మీద స్వైప్ చేస్తే చాలు. సెకండ్స్‌‌లో వాళ్లతో మాట్లాడగలం కానీ అంత తక్కువటైంలో కనెక్ట్ అవగలిగే ఛాన్స్ వచ్చాక మనలో ఉండాల్సిన ఎమోషన్స్ చాలా తగ్గిపోయాయి. మనం చెప్పాలనుకున్న విషయంలో కూడా ఎక్స్‌‌ప్రెసివ్ నెస్ పూర్తిగా మాయమయ్యింది. ఇప్పుడు ఎమోషనల్ గా మాట్లాడటం అంటే కవిత్వం చెప్పటం అనుకుంటున్నాం. అందుకే ఒక ఉత్తరం రాయటం అంటే ఆ మనిషికి మరింతగా దగ్గరవ్వటం. ఒక లెటర్ రాయాలంటే ముందు వాళ్ళ మొహాన్ని గుర్తు తెచ్చుకుంటాం. వాళ్ళతో మాట్లాడిన మాటలనీ గుర్తు చేసుకుంటాం. ప్రేమలేఖ అంటే ఓన్లీ ప్రపోజల్ కోసం మాత్రమే కాదుకదా. ఎదుటి మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నామో చెప్పే మీడియం అందుకే ఒక్కసారి ఫోన్, కంప్యూటర్ కీబోర్డ్ పక్కన పెట్టి ఒక ఉత్తరం రాస్తే. తేడా మనకే అర్థమైపోతుంది.

ఒక లవ్ లెటర్ రాసేద్దాం…

ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌‌లో పలకరించుకోవటం, ఎమోజీలతో ఫీలింగ్స్ చెప్పటం ద్వారా నిజంగా మనలో ఉన్న ఎమోషన్స్ మనం చెప్పాలనుకున్న వాళ్లకి చేరిపోతాయా? ఒక్క లవ్ లెటర్ రాసుకోవటానికి కలర్ పేపర్ తీసుకోవటం దగ్గరి నుంచే మొదలవుతుంది ఆలోచన, తనకి ఏ రంగు నచ్చుతుంది? లెటర్ రాయటానికి ఏ కలర్ ఇంక్ వాడాలి?, కవితతో మొదలు పెట్టాలా అని ఆలోచిస్తూనే రాసుకోవటానికి కూచునే ప్లేస్ కూడా స్పెషల్ గా ఉండాలి అని చూసుకోవటం.. ఇవన్నీ ఒక్క ప్రేమ లేఖ రాయటానికే. కానీ ఈ ప్రాసెస్ అంతా మనం ప్రేమిస్తున్న వాళ్లని గురించి ఆలోచించటానికే… ఇవన్నీ ఆలోచిస్తే ‘ఏంటీ పిచ్చి!?’ అనిపిస్తుంది కానీ…. ఒక్క సారి ట్రైచేసి చూస్తే తెలుస్తుంది. మన గుండె చప్పుడు మనకే వినిపించే ఫీల్ లవ్ లెటర్ రాసేటప్పుడు వస్తుంది. ప్రేమకి కావాల్సిన కెమికల్ రియాక్షన్ ఇంకా బలంగా జరుగుతుంది. అలాంటి ఎమోషన్ ని ఒక్క ఎస్సెమ్మెస్ తో పోగొట్టుకుందామా? నెవర్…..  అందుకే ఇవాళే ఒక లవ్ లెటర్ రాస్తే..

లవ్ లెటర్ అంటే ఒక కాగితం ముక్క మాత్రమే కాదు కదా…. మనలో ఉన్న ఫీలింగ్ ని బలంగా చెప్పటానికి అదొక్కటే మార్గం. నాలుగు మాటల్లో చెప్పేసే దాన్ని ఒక లెటర్ గా రాసి చూస్తే? అనిపిస్తుంది.  ఓ పదేళ్ళ తర్వాత అదే పేపర్ చేతిలోకి వస్తే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనంత. ఎన్నో జ్ఞాపకాలు ఆ ఒక్క పేపర్ ముక్క చుట్టూ. మనం ఫోన్‌‌లో పంపే టెక్ట్స్​ మెసేజ్ కన్నా పేపర్ మీద రాసి చేతికి ఇచ్చినప్పుడు ఎదుటి మనిషి మన ప్రేమని మరింత స్పెషల్‌‌గా ఫీలవుతాడట. మానసికంగా మనల్ని దగ్గరగా ఫీల్ అవటానికి లవ్‌‌ లెటర్ మంచి మార్గం అంటారు సైకాలజిస్టులు.  మన పేరు రాసి ఉన్న ఒక లెటర్, మనకు మాత్రమే ప్రత్యేకంగా రావటం అంటే ఆ సంతోషాన్ని లెక్క గట్టగలమా…. మనకోసం ఒకరు కొన్ని గంటలు ఆలోచించి ఉంటారు కదా అన్న ఫీలింగ్ చాలు వాళ్లకి మనమెంత ముఖ్యమో, ఎంత ప్రేమ ఉందో చెప్పటానికి.

లవ్ లెటర్ రాసేటప్పుడు ఉన్న టైం అంతా మనం ప్రేమిస్తున్న వాళ్లగురించే ఆలోచిస్తారు, వాళ్ళ గురించి ప్రతీ విషయాన్నీ గుర్తుచేసుకుంటారు. అలా చాలాసేపు ఆ ఊహల్లో ఉండటం వల్ల మనసు కూడా ప్రశాంతంగా ఉత్సాహంగా మారుతుంది. చాలామంది ప్రేమని చెప్పటానికీ, ప్రపోజ్ చేయటానికీ భయపడతారు ఎలా చెప్పాలో అర్థం కాదు. అలాంటి వాళ్లకి లవ్ లెటర్ రాయటం బెస్ట్ ఆప్షన్. మన ప్రతీ ఫీలింగ్ నీ లోతుగా అర్థమయ్యేలా రాయగలం, తడబడటం, పొరపాటున ఏదేదో చెప్పెయ్యటం లాంటివేమీ ఉండవు. చాలారోజులుగా ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళకి కూడా ఎదురుగా చెప్పలేని వాళ్ళు ప్రేమలేఖలో అవన్నీ చెప్పగలరు. ప్రేమలేఖ అంటే ‘ప్రేమిస్తున్నా’ అని చెప్పటానికి మాత్రమే కాదు ఆల్‌‌రెడీ ప్రేమలో ఉన్నవాళ్ళు, పెళ్లైన వాళ్ళూ రాసుకోవచ్చు. అమ్మానాన్నలకీ, ఫ్రెండ్స్‌‌కీ రాయొచ్చు. రొటీన్‌‌గా గడుస్తున్న లైఫ్‌‌లో ఇది కచ్చితంగా చిన్న చేంజ్ తెస్తుంది.

లవ్ లెటర్ రాసేస్తే అయిపోయిందా….. దాన్ని మంచి కవర్లో పెట్టాలా, లేదా గ్రీటింగ్ కార్డ్ తో కలిపి ఇవ్వాలా లేదా ఒక గులాబీతో కలిపి ఇవ్వాలా అని ఇంకా ఆలోచనలు వస్తూనే ఉంటాయి…. నిజంగా ప్రేమలేఖ రాయటం ప్రేమలో ఉన్న అద్భుతమైన అనుభవం. ఓసారి ట్రై చేసి చూద్దాం మరి.

మొదటి ప్రేమలేఖ

ప్రపంచంలో మొదటి ప్రేమలేఖ ఏదీ అని ఇప్పటికీ చర్చ నడుస్తూనే ఉంది గానీ… మనవరకూ మొట్టమొదటి ప్రేమలేఖ కథ
మహాభారతంలో ఉంది. అది రుక్మిణి కృష్ణుడికి రాసిన ప్రేమలేఖ. రుక్మిణీ దేవి విదర్భరాజు భీష్మకుడి కుమార్తె.  కూతురి ప్రేమ వివాహానికి తండ్రి అంగీకరించినా.. అన్న రుక్మ అంగీకరించడు.  రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటాడు.  అనుకున్నట్టుగానే.. అందుకు ముహూర్తం నిర్ణయిస్తాడు.  అయితే, ఇష్టంలేని రుక్మిణి  వివాహానికి ముందురోజు కృష్ణుడ్ని తాను ప్రేమిస్తున్నట్టు చెబుతూ… వచ్చి తనని పెళ్ళి చేసుకొమ్మని ఓ లేఖ రాసి సునంద అనే చెలికత్తెతో కృష్ణుడికి అందేలా పంపుతుంది. ఆ తర్వాత జరిగిన కథ మనందరికీ తెలిసిందే.

see also:

ప్రేమించిన అమ్మాయి ఇంటికి నిప్పు..ఇద్దరు సజీవ దహనం

చిన్నతనంలో నాపై రేప్ జరిగింది : రాహుల్ రామకృష్ణ

‘నారప్ప’ రచ్చ : మా వాళ్లే రియల్‌‌ హీరోలు..!