
- మంచి పని ఎవరు చేసినా మెచ్చుకోవాల్సిందే: కాటిపల్లి వెంకట రమణా రెడ్డి
- రుణమాఫీతో రైతులకు మేలు జరుగుతుందని వ్యాఖ్య
- సభను సభ్యులు ఇంటర్ క్లాసుల్లా మారుస్తున్నరని ఆవేదన
హైదరాబాద్, వెలుగు: మంచి పని ఎవరు చేసినా మెచ్చుకోవాల్సిందేనని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ మంచి విషయమని, మంచి పని చేస్తున్నారు కాబట్టే పార్టీలతో సంబంధం లేకుండా కార్యక్రమానికి హాజరయ్యానని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే అయినా.. ఇది మనందరి ప్రభుత్వమని, మన రాష్ట్ర ప్రభుత్వమని చెప్పారు.
రుణమాఫీకి సంబంధించినవాటిపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ఫొటోలే ఉన్నాయని.. రాహుల్, సోనియా గాంధీ ఫొటోలు పెడితే అభ్యంతరం ఉండేదని, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలంతా హాజరవ్వాల్సిందని చెప్పుకొచ్చారు. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను స్కూల్ పిల్లాడిలా అసెంబ్లీలో చెప్పిన విషయాలన్నీ బుక్కులాగా రాసుకున్నానని.. కానీ, సభలో సభ్యుల తీరు మాత్రం ర్యాగింగ్ చేసుకుంటున్నట్టుగా ఉందని అన్నారు. సభ నడుస్తున్న తీరు చూస్తుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
సభ్యుల తీరు ఇంటర్ కాలేజీ స్టూడెంట్స్లాగా తయారైందన్నారు. ఇంటర్ లో స్టూడెంట్లు ఒక క్లాసు అయిపోగానే.. లెక్చరర్ ఉండగానే బయటకు వెళ్లిపోతున్నట్టుగా సభ నుంచి ఎమ్మెల్యేలు పోతున్నారని వ్యాఖ్యానించారు. ఇది మంచి పద్ధతి కాదని, క్రమశిక్షణగా ఉండి తర్వాతి తరాలకు మనం ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
ధరణితో రైతులకు అన్యాయం
ధరణి పోర్టల్వల్ల నిజమైన రైతులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని వెంకటరమణా రెడ్డి అన్నారు. అస్తవ్యస్తమైన వ్యవస్థతో రైతులు తమ సొంత భూములను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాంటి రైతులకు న్యాయం చేయాలన్నారు. పోలీసులకు సరెండర్ లీవ్స్ ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు వారు భద్రతనిస్తున్నారని, వాళ్లు స్ట్రైక్ చేస్తే మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. వారి ప్రమోషన్లలో అన్యాయం జరుగుతున్నదని తెలిపారు.
వీఆర్ఏ, వీఆర్వోలకు ఉద్యోగాలివ్వండి
గత ప్రభుత్వం వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి వారి జీవితాలను అగమ్యగోచరం చేసిందని వెంకట రమణా రెడ్డి అన్నారు. ఉద్యోగాల్లేక వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని.. వారికి ఉద్యోగాలిస్తామన్న మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ‘ప్రభుత్వ స్కూళ్లను బాగు చేస్తే ప్రైవేటు స్కూళ్ల వైపు జనం ఎందుకు వెళ్తారు. నాకూ ఓ స్కూల్ ఉంది. ప్రభుత్వ బడులను బాగు చేస్తే నాకున్న స్కూల్‌ను మూసేసేందుకు నేను సిద్ధం’ అని ఆయన అన్నారు.