సెన్సిటివ్ గా ఉండటం అంటే..

సెన్సిటివ్ గా ఉండటం అంటే..

అనుకోకుండా సోషల్ మీడియా న్యూస్ ఫీడ్ చూస్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ ఫొటో చూస్తే బాధగా అనిపిస్తుంది. రోడ్డుమీద వెళ్తున్నప్పుడు గాయపడ్డ చిన్న కుక్కపిల్లనో, రెక్కకి దెబ్బతగిలి ఎగరలేకపోతున్న పావురాన్ని చూసినప్పుడో అయ్యో పాపం అనిపిస్తుంది వాటికి సాయం చెయ్యటమో, బాధపడటమో చేస్తాం. అదిచూసి ‘మావాడు… టూ సెన్సిటివ్’ అనుకుంటారు పక్కన ఉన్న స్నేహితులు.అయితే..!  కాలేజ్‌‌కి లేట్ అయ్యింది ప్రిన్సిపల్ కోప్పడిన, రోజూ మాట్లాడుతున్న ఫ్రెండ్‌‌తో గొడవయినా, లేదంటే ప్రేమలో ఏదో సమస్య వచ్చి బ్రేకప్ అయినా వీటికీ బాధ అనిపిస్తుంది, కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి ‘అరే వాడు… సెన్సిటివ్ మామా’ అంటారు అది చూసినోళ్ళు.

ఈ రెండు సందర్భాలలో “సెన్సిటివ్” గా ఉండటం అని దేన్నంటారు? ‘మనకు వచ్చే ప్రతీ చిన్న సమస్యకి బాధపడటం అంటే… అది మానసికంగా బలహీనమవడం. అదెప్పటికీ సెన్సిటివ్ గా ఉండటం కాదు’ అంటాడు ఓషో.  సైకాలజిస్టులు చెబుతున్నది కూడా అదే మాట. సెన్సిటివిటీ అని మనం అనుకుంటున్నది మన వీక్‌‌నెస్ మాత్రమే. అది మానసికపరమైన సమస్యగా కూడా మారొచ్చు అంటున్నారు మానసిక నిపుణులు.  ‘నన్ను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు, నేను ఒంటరిని’ అనే ఫీలింగ్‌‌లో ఉండేవాళ్ళు ‘‘ నేను సెన్సిటివ్’’ అనుకుంటారు. కానీ అది మానసిక బలహీనత. మనల్ని మనమే తక్కువ చేసుకునే సెల్ఫ్ పిటీకి దారి తీస్తుంది.   ఒక విషాదకర సందర్భంలో మనసు  ఆందోళన చెందటాన్ని సిచ్యుయేషనల్ డిప్రెషన్ అంటారు. కానీ, ఆ వార్త విని కొన్ని రోజుల పాటు  తిండి కూడా తినకుండా, ఎప్పుడూ అదే ఆలోచిస్తూ బాధపడుతున్నప్పుడు మాత్రం  అది కచ్చితంగా మెడికల్ అంశం అవుతుంది. దీన్ని క్లినికల్ డిప్రెషన్ అంటారు.

మామూలుగా ధైర్యంగా ఉండే వ్యక్తులు కూడా కొన్ని సార్లు  అతి సున్నితత్వంవలన. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, ఇలాంటప్పుడు  ఎంత త్వరగా వాళ్లని ఆ ఆలోచన నుంచి బయటపడేస్తే అంత మంచిది. డాక్టర్‌‌‌‌ని వెంటనే కలవాలి. డా. ప్రవీణ్ కుమార్ చింతపంటి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ట్రాంక్విల్ మైండ్స్, హైదరాబాద్

రెంటికీ మధ్య తేడా ఉంది

మారుతున్న లైఫ్ స్టైల్ మనుషులని దూరం చేస్తోంది. మనుషులతో డైరెక్ట్‌‌గా మాట్లాడటం తగ్గిపోయింది. ఫోన్‌‌లో మాట్లాడటం, వాట్సాప్ లో కంటిన్యూగా టచ్‌‌లో ఉండటంతో మనుషులని కలిసిన ఎగ్జైట్‌‌మెంట్ కి దూరం అవుతున్నాం. దానివల్ల పెరిగిన స్ట్రెస్ బాధ రూపంలో బయటికి వస్తుంది. ప్రతీ చిన్న దానికీ అతిగా స్పందించటం, వెంటనే కోపం రావటం లాంటి బిహేవియర్ నెమ్మదిగా మనల్ని మనమే సెన్సిటివ్ అనుకునేలా చేస్తుంది. కానీ అది మనలో పెరుగుతున్న స్ట్రెస్ కి సూచన. నిజానికి మనం అనుకున్నట్టు అది సెన్సిటివిటీ కాదు. ఇలాగే ఆలోచించటం కంటిన్యూ అయితే అది మరింతగా మనల్ని కుంగదీస్తుంది. అసలు ఏది వీక్‌‌నెస్ ఏది సెన్సిటివ్ నెస్?

మనకు ఆరోగ్యం బాగాలేదనో, ఎవ్వరూ మనల్ని పట్టించుకోవటం లేదనో బాధపడటం. పదే పదే ఆ విషయాలని ఇతరుల దగ్గర తరచూ చెప్పటం సెన్సిటివ్ నెస్​ కాదు.ఎవరైనా ఒక మాట అనగానే వెంటనే ఏడ్చెయ్యటం, ఎవరైనా వేధిస్తున్నా వాళ్లని తిరిగి గట్టిగా ఏమీ అనకపోవటం సెన్సిటివ్ నెస్​ కాదు. ఎప్పుడూ బాధపడుతూ మూడీగా ఉండటం, ప్రతీసారీ ఎవరో ఒకరినుంచి ఓదార్పు కోరుకోవటం మానసిక బలహీనత కిందకే వస్తుంది తప్ప సెన్సిటివ్‌‌గా ఉండటం అనిపించుకోదు.

 

..వాటివల్లే ఇదంతా

మానసికంగా వారిని వారు తక్కువ చేసుకోవటం, ప్రతీ చిన్న సమస్యకీ కుంగిపోవటం లాంటి లక్షణాలు చిన్న తనంలో జరిగిన అనుభవాలనుంచే వస్తాయి. ఎక్కడో జరిగిన ఒక ప్రమాదాన్ని టీవీలో చూసి కూడా బాధ పడటం, ఆనందంగా ఉండాల్సిన సమయంలో కూడా ఈ సంతోషం తర్వాత మళ్ళీ బాధే కదా వచ్చేది అంటూ నిరాశగా ఉండిపోవటం లాంటి ఆలోచనా ధోరణికి బాల్యంలో జరిగిన సంఘటనలకీ సంబంధం ఉంటుంది. సున్నిత మనస్కులు అంటే నిజానికి అతిగా స్పందించే గుణం ఉన్నవాళ్ళు. చిన్న వయసులోనే పేరెంట్స్‌‌కి దూరం అవటం, తల్లి లేదా తండ్రి చనిపోవటం వల్ల కూడా ఏర్పడ్డ అభద్రతా భావం ఇలా ప్రతీదానికీ భయపడే గుణానికి కారణం అవుతుంది. కళ్ళముందు జరిగే కొన్ని సంఘటనలపై స్పందించటం వరకూ అయితే ఫర్వాలేదు కానీ ప్రతీ సంఘటనకీ విపరీతంగా చలించి పోవటం, కొన్నిటికి తమకు తామే సెల్ఫ్ పిటీకి లోనవ్వటం వల్ల వ్యక్తిగత జీవితంలో చాలా సమస్యలు వస్తాయి.

More News: అమ్మాయిలు మనోళ్లే.. ఆడేది అమెరికా లీగ్ లో!

బరిలో భార్యలను నిలిపి.. ప్రచారంలో భర్తల హామీలు