
- ఇండ్లు ఉన్నవాళ్లకు కాదు, ముందుగా ఇండ్లు లేని పేదలకు కేటాయించామన్న ఇందిరమ్మ కమిటీ సభ్యులు
కోటపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన కుమ్మరి రవీందర్ ఓవైపు లక్షల రూపాయల ఖర్చుతో రెండు బెడ్రూమ్లతో బిల్డింగ్ కట్టుకుంటూనే.. మరోవైపు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ గ్రామానికి మొదటి విడతలో 22 ఇండ్లు శాంక్షన్ కాగా.. ముందుగా ఇండ్లు లేని పేదలకు ఇవ్వాలని ఇందిరమ్మ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఆ మేరకు లిస్టు రెడీ చేసి ఎంపీడీవోకు పంపగా, ఆయన బుధవారం సాయంత్రం గ్రామానికి వచ్చి ఎంక్వయిరీ చేశారు. లిస్టులో తన పేరు లేదని తెలుసుకున్న రవీందర్ పంచాయతీ దగ్గరికి వచ్చి లిస్టును లాక్కొని వెళ్లాడు.
అనంతరం రాత్రి 8.30 గంటలకు మిర్చి తోట దగ్గరికి వెళ్లి పురుగుల మందు తాగాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెళ్లి అతడిని మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. రవీందర్ కొత్తగా బిల్డింగ్ కట్టుకుంటున్నందు వల్లే అతనికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని, ఫస్ట్ ఫేస్‌లో ఇండ్లు లేని పేదలను సెలెక్ట్ చేశామని ఇందిరమ్మ కమిటీ సభ్యులు తెలిపారు. కొంతమంది కావాలనే తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారని పేర్కొన్నారు.