అమెరికాలో సెలబ్రిటీగా మిస్టీరియస్ లెదర్‌‌మ్యాన్

అమెరికాలో సెలబ్రిటీగా మిస్టీరియస్ లెదర్‌‌మ్యాన్

అమెరికాలోని ఒక టౌన్​కి కొత్త వ్యక్తి వచ్చాడు. చూడడానికి వింతగా ఉన్నాడు. ఎవరితోనూ మాట్లాడడం లేదు. బట్టలు కూడా వింతగా ఉన్నాయి. బూట్ల నుంచి చొక్కా వరకు వేసుకున్నవన్నీ లెదర్​తో చేసినవే. అందరూ అతన్ని వింతగా చూశారు. ఆ రోజు అక్కడే ఉండి వెళ్లిపోయాడు. సరిగ్గా 34 రోజులకు మళ్లీ వచ్చాడు. అప్పుడు కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అలా ప్రతి 34 రోజులకు ఒకసారి వస్తూనే ఉన్నాడు. దాంతో అతనెవరు? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. తర్వాత అతని గురించి తెలుసుకొని షాకయ్యారు.

ఈ మిస్టీరియస్ లెదర్‌‌మ్యాన్ 19వ శతాబ్దంలో అమెరికాలో ఒక సెలబ్రిటీ. అతన్ని చూసేందుకు ఎంతోమంది ఎగబడేవాళ్లు. అతని మీద కొందరు రీసెర్చ్​లు కూడా చేశారు. అయినా.. అతనెవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అనేవి తెలుసుకోలేకపోయారు. 

లెదర్​ మ్యాన్​ గురించి అమెరికన్ సివిల్ వార్​కి ముందు అందరికీ తెలిసింది. అప్పట్లో చాలామంది పని లేక ఇబ్బంది పడేవాళ్లు. మూడు పూటలా తిండి దొరకడమే కష్టంగా ఉండేది. అలాంటి టైంలో ఒక వ్యక్తి ప్రతి 34 రోజులకు ఒకసారి ఒక టౌన్​కి వచ్చేవాడు. ఆరా తీస్తే.. అతను ఆ టౌన్​కే కాదు.. చాలా టౌన్స్​కి వెళ్లేవాడని తెలిసింది. అన్ని టౌన్స్​కి 34 రోజులకే వెళ్లేవాడు. అలా ఎందుకు వెళ్తున్నాడని కారణం తెలుసుకుంటే.. అతను కనెక్టికట్, వెస్ట్‌‌చెస్టర్​లోని హడ్సన్​ నదులు మధ్య నడిచేవాడని తెలిసింది. రెండింటి మధ్య 365 మైళ్ల దూరం ఉంటుంది. ఆ దూరాన్ని అతను సరిగ్గా 34 రోజుల్లో నడిచేవాడు. ఎప్పుడో ఒకసారి 35 రోజులు పట్టేది. ప్రతి రోజు ఉదయం నిద్ర లేవడంతోనే నడక మొదలయ్యేది. కనెక్టికట్​ నుంచి హడ్సన్​ తీరం వరకు వెళ్లి మళ్లీ వెంటనే తిరుగు ప్రయాణం మొదలుపెట్టేవాడు. అతని పేరు ఎవరికీ తెలియదు. ఎప్పుడూ ఒకే లెదర్​ డ్రెస్​ వేసుకునేవాడు. ఎవరైనా బట్టలు ఇచ్చినా తీసుకునేవాడు కాదు. అందుకే అందరూ ‘‘లెదర్​ మ్యాన్” అని పిలిచేవాళ్లు.  

డిఫరెంట్​ లుక్​

లెదర్​ మ్యాన్ 1839లో పుట్టి ఉండొచ్చనేది ఒక అంచనా. అతన్ని మొదటిసారిగా 1857లో గుర్తించారు. హ్యాండ్​ మేడ్​ స్లాక్స్, చొక్కా.. దానిపై జాకెట్ వేసుకునేవాడు. భుజంపై స్కార్ఫ్‌‌ వేసుకుని, టోపీ పెట్టుకుని ఉండేవాడు. దాదాపు 20 కిలోలకు పైగా బరువు ఉండే పెద్ద బూట్లను వేసుకునేవాడు. అలా డిఫరెంట్​గా ఉండడంతో అతన్ని అందరూ వింతగా చూసేవాళ్లు. అయితే.. కొత్తలో అతన్ని చూసి భయపడేవాళ్లు. కానీ.. కొన్నాళ్లకు అతనివల్ల ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని గుర్తించారు. చాలా అరుదుగా మాట్లాడేవాడు. ఎవరితోనూ పెద్దగా కలిసేవాడు కాదు. అతని గురించి ఏ విషయమూ చెప్పేవాడు కాదు. ఎక్కువసార్లు సైగలతోనే అతనికి కావాల్సింది అడిగేవాడు. 

 ఫ్రాన్స్​ నుంచి.. 

మాట్లాడే కొన్ని మాటల్లో ఎక్కువగా ఫ్రెంచ్​ పదాలు ఉండేవి. చాలా తక్కువ పదాలు ఇంగ్లీష్​లో మాట్లాడేవాడు. అతని దగ్గర ఫ్రెంచ్​ ప్రేయర్​ బుక్​ ఉండేది. దీన్నిబట్టి ఫ్రాన్స్​ నుంచి వచ్చి ఉంటాడని చాలామంది అనుకున్నారు. కానీ.. కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోయారు. 

ఎలాంటి వాతావరణంలో అయినా.. 

లెదర్​ మ్యాన్​ వాతావరణం ఎలా ఉన్నా నడక ఆపేవాడు కాదు.. ఎండ, వాన, మంచు తుపాన్లు, గడ్డకట్టే చలి.. ఏదొచ్చినా అడుగు ముందుకే వేసేవాడు. పర్డీస్, కెన్సికో, సౌత్ సేలం, క్రోటన్ ఫాల్స్, యార్క్‌‌టౌన్, ష్రబ్ ఓక్, బ్రియార్‌‌క్లిఫ్, బెడ్‌‌ఫోర్డ్ హిల్స్‌‌ ప్రాంతాలు అతని హాల్టులు. ఆ ప్రాంతాల్లోని గుహల్లో పడుకునేవాడు. ఆకలేసిన ప్రతిసారి లోకల్​గా ఉండే ఫామ్‌‌హౌస్‌‌లు, ఇండ్ల దగ్గర ఆగేవాడు. అక్కడివాళ్లు తిండి పెట్టేవాళ్లు. చాలామంది అతనికోసం ఎదురు ​ చూసేవాళ్లట. కొందరు ఆడవాళ్లు ప్రతి 34వ రోజు అతని కోసం ప్రత్యేకంగా కొన్ని రొట్టెలు తయారు చేసేవాళ్లట. అతనికి టైం సెన్స్​ కూడా చాలా ఎక్కువ. ఒక ఇంటికి ప్రతిసారి ఒకే టైంలో వెళ్లేవాడు. అతనికి తిండి ఇచ్చినవాళ్లకు ‘‘థ్యాంక్యూ సో మచ్​ లేడీ”అని చెప్పి వెళ్లిపోయేవాడు.   

లోకల్​ సెలబ్రిటీ 

లెదర్​ మ్యాన్​ కొన్ని సంవత్సరాల్లో లోకల్​గా పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. ఆ ప్రాంతంలో అందరూ అతన్ని గౌరవించేవాళ్లు. అంతెందుకు ఒకసారి కనెక్టికట్ స్టేట్ 1879లో ‘‘ట్రాంప్ లా”అనే ఒక చట్టం చేసింది. దీని ప్రకారం పోలీసులకు ‘హోబో’(హోమ్​ లెస్​ పీపుల్​)లను అరెస్టు చేసి జైలులో పెట్టే అధికారం ఇచ్చింది. కానీ.. ఆ చట్టంలో లెదర్​ మ్యాన్​కి మినహాయింపు ఇచ్చింది. ఒకసారి ఆరోగ్యం బాగాలేనప్పుడు మాత్రమే అతన్ని పోలీసులు హాస్పిటల్​కి తీసుకెళ్లి, ట్రీట్​మెంట్​ చేయించి వదిలేశారు. 

చనిపోయాక...

దాదాపు 32 ఏండ్లు సుదీర్ఘ ప్రయాణం చేసిన లెదర్​మ్యాన్​ మార్చి 24, 1889న మౌంట్ ప్లెసెంట్‌‌లోని సా మిల్ వుడ్స్ గుహలో చనిపోయాడు. చావుకు కారణం.. పొగాకు నమలడం వల్ల వచ్చిన నోటి క్యాన్సర్ అని తెలిసింది. శవాన్ని న్యూయార్క్‌‌లోని ఒస్సినింగ్‌‌లోని స్పార్టా స్మశానవాటికలో ఖననం చేశారు. అయితే.. లెదర్​ మ్యాన్​ చనిపోయిన తర్వాత అతని గురించి అనేక విషయాలు ప్రచారంలోకి వచ్చాయి.  వాటిలో అతని లవ్​ స్టోరీ బాగా పాపులర్​ అయింది. అదేంటంటే.. ఫ్రాన్స్​లో బాగా డబ్బున్న అమ్మాయితో అతను ప్రేమలో పడ్డాడు. కానీ.. దానికి ఆ అమ్మాయి వాళ్ల నాన్న ఒప్పుకోలేదు. అమ్మాయిని చంపేసి, లెదర్​ మ్యాన్​ ఇంటిని కాల్చేశాడు. దాంతో అతను పారిపోయి అమెరికాకు వచ్చాడు. 

శవం దొరకలేదు

2011లో లెదర్​ మ్యాన్​ సమాధిని ప్రస్తుతం ఉన్న ప్లేస్​ నుంచి తీసి కొంత దూరంలో కొత్తగా కట్టాలి అనుకున్నారు. అందుకే అతన్ని పూడ్చిన చోట తవ్వారు. కానీ.. అక్కడ లెదర్​ మ్యాన్​ శవం అవశేషాలు దొరకలేదు. శవపేటికలో అతని గోర్లు మాత్రమే ఉన్నాయి.