ఈ సారి సర్కారే మక్కలు కొంటది..కొనుగోళ్ల బాధ్యత మార్క్‌‌ఫెడ్​కు అప్పగింత

ఈ సారి సర్కారే మక్కలు కొంటది..కొనుగోళ్ల  బాధ్యత మార్క్‌‌ఫెడ్​కు అప్పగింత
  • రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు
  • 6.66 లక్షల ఎకరాల్లో సాగైన మక్క
  • 17.84 లక్షల టన్నుల దిగుబడి అంచనా
  • గతంలో బీఆర్‌‌ఎస్‌‌ సర్కారు మక్కలు కొనక ఆగమైన రైతులు
  • ఈ యేడు ముందస్తు కొనుగోళ్ల కోసం సర్కారు కసరత్తు

 హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఈ సారి సర్కారే మక్కలు కొనేందుకు సిద్ధమైంది. కొనుగోళ్ల బాధ్యతలను మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌కు  అప్పగించింది. మార్క్​ఫెడ్ ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మక్కల కొనుగోళ్లు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. రాష్ట్రంలో యాసంగిలో సాగైన మక్కజొన్న పంట చేతికి వస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ యేడు మక్కల కొనుగోళ్లకు కసరత్తు పూర్తి చేసి, ప్రతిపాదనలతో ప్రణాళికలు సిద్ధం చేశారు. 

సర్కారు కొంటదని మక్క ఎక్కువేసిన్రు.. 

నీటి వసతి ఎక్కువగా లేని ప్రాంతాల్లో రైతులు యాసంగిలో మక్క ఎక్కువగా వేసిన్రు. సాధారణ సాగు 5.11 లక్షల ఎకరాలైతే.. ఈ యేడు యాసంగిలో 6 లక్షల 66 వేల 772 ఎకరాల్లో మక్కజొన్న పంట సాగు చేశారు. ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు.. సగటున 26.80 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. విస్తీర్ణం ప్రకారం 17 లక్షల 84 వేల టన్నుల  దిగుబడి వస్తుందని అంచనాలు ఉన్నాయి. 

మొదట్లో పంట ఏపుగా పెరిగి ఆశాజనకంగానే ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య, ఇటీవల కురిసిన అకాల వర్షాలతో  కొంతమేర నష్టం జరిగింది. అయినప్పటికీ పంట దిగుబడి మెరుగ్గానే ఉంది. ముందస్తుగా వేసిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రైతులు కంకులు ఇరవగా.. మరి కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే పంట చేతికి వస్తున్నది. మక్క కంకులు విరిసిన రైతులు మిషిన్లతో గింజలు పట్టిస్తున్నరు. మక్కలు అమ్మేందుకు సిద్ధమవుతున్నరు.

గత సర్కారు మక్కలు కొనక నష్టపోయిన రైతాంగం

గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కారు హయాంలో మక్కలు కొంటే నష్టం వస్తుందని.. మక్కపంట సాగుచేయొద్దని ప్రకటనలు విడుదల చేశారు. మక్కలు వేస్తే కొనేది లేదనీ తెగేసి చెప్పడంతో అప్పట్లో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. మక్కజొన్న రైతుల కష్టం దళారుల పాలైంది.  ముందటేడు మక్కలు మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చే టైమ్‌‌‌‌‌‌‌‌కు దళారులు ధరలను అమాంతం తగ్గించి కొని, రైతులను నట్టేట ముంచారు. మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి పోటెత్తిన టైమ్‌‌‌‌‌‌‌‌లో గత సర్కారు మక్కలు కొనకపోవడంతో ఇదే అదనుగా వ్యాపారులు కుమ్మక్కై  ధరను తగ్గించారు. దీంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌ యార్డుల్లో మక్కలు కుప్పలు పోసి తక్కువ ధరకు అమ్ముకోలేక, ఎక్కువ ధర రాక రైతులు అరిగోస పడ్డరు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కారు మక్కలు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో రైతులను దళారులు, వ్యాపారులు నిలువునా దోచుకున్నరు. మద్దతు ధర కంటే మూడు, నాలుగు వందలు తగ్గించి కొనడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ యేడు మద్దతు ధర రూ.2,090తో మక్కల కొనుగోళ్లకు సర్కారు సిద్ధమవడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

దళారుల బాధ తప్పుతుంది 

గతంలో దళారులకు మక్కలు అమ్ముకుని నష్టపోయాం. ఈ యేడు  ప్రభుత్వపరంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఆ బాధ ఉండదు. కొత్త సర్కారు కొనుగోళ్లు చేపడితే మార్కెట్‌‌‌‌‌‌‌‌లో  మద్దతు ధర పలుకుతుంది. బయట మార్కెట్‌‌‌‌‌‌‌‌లో అగ్గువకు అమ్ముకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ధర మంచిగనే ఉన్నదని అంటున్నరు. 
‑ రాజయ్య, రైతు, వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా