
న్యూఢిల్లీ: ఈసారి బడ్జెట్ వల్ల రాష్ట్రాల ఖజానాలు మరింత బలోపేతమవుతాయని, వాటికి భారీగా నిధులు అందుతాయని తాజా స్టడీ ఒకటి వెల్లడించింది. ముఖ్యంగా రాష్ట్రాల్లో ఇన్ఫ్రా ప్రాజెక్టులకు మరింత డబ్బు సమకూరుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్రా) స్టడీ వెల్లడించింది. 2023 ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ ప్రతిపాదనలు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధిని పెంచుతాయని స్పష్టం చేశాయి. ‘మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ఆర్థిక సహాయ పథకం' కింద వీటికి రూ.లక్ష కోట్ల కేపెక్స్ను ఇస్తారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో రాష్ట్రాలకు జీఎస్డీపీలో 4శాతం ఆర్థిక లోటును అనుమతించారు. ఇది కేంద్ర ప్రభుత్వం అనుమతించిన దానికంటే ఎక్కువే! రాష్ట్ర ప్రభుత్వాలు మూలధన ఆస్తులను పెంచుకోవడం దేశాభివృద్ధికి కీలకం.
పన్నుల వాటా కూడా పెరుగుతుంది
మూలధన వ్యయాన్ని పెంచడంతోపాటు పన్నుల వాటాలను ఎక్కువ ఇవ్వడం వల్ల 2023 ఫైనాన్షియల్ ఇయర్లో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. రాష్ట్రాలు ఆర్థిక లోటు/జీఎస్డీపీ నిష్పత్తి కంటే 3.5శాతం ఎక్కువ అప్పులను తీసుకోవడానికి కొన్ని కీలక రంగాలలో కొత్త నిర్ణయాలను అమలు చేయాలి. గతాన్ని గమనిస్తే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ కేపెక్స్కు ఎక్కువ ఖర్చు చేశాయి. 2016–20 ఫైనాన్షియల్ ఇయర్స్ మధ్య కేంద్ర ప్రభుత్వ వాటా 1.7శాతం కాగా, రాష్ట్రాలు జీడీపీలో 2.7శాతం మొత్తాన్ని కేపెక్స్కు ఖర్చు పెట్టాయి. కరోనా ఇబ్బందుల వల్ల రాష్ట్రాల కేపెక్స్ గత ఆర్థిక సంవత్సరంలో 2.2శాతం కంటే తక్కువ ఉంటుందని అనుకున్నప్పటికీ ఇది 2.6శాతంగా రికార్డయింది.
గత ఏడాది రూ.15 వేల కోట్ల కేపెక్స్
ఆర్థిక సహాయ పథకం కింద రూ.10 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా, 2022 ఫైనాన్షియల్ ఇయర్ 22 కొత్త అంచనాల ప్రకారం (ఆర్ఈ) ప్రకారం రాష్ట్రాలకు రూ.15 వేల కోట్ల కేపెక్స్కు అందించింది. ఈ డబ్బును 50 సంవత్సరాల్లోపు వడ్డీ లేకుండా కడితే చాలు. పీఎం గతిశక్తి, ఇతర సంబంధిత పథకాలు, గ్రామీణ రోడ్లు, డిజిటలైజేషన్ , పట్టణ రంగ సంస్కరణలు/అభివృద్ధి కోసం దీనిని ఉపయోగించాలి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద కేటాయింపును 2022–-23 సంవత్సరానికి రూ.లక్ష కోట్లకు పెంచింది. 2022 ఫైనాన్షియల్ ఇయర్ అంచనాల ప్రకారం రూ.13.39 లక్షల కోట్లు ఇవ్వాలని భావించగా, కరోనా సమస్యలను దృష్టిలో ఉంచుకుని, 2022 ఫైనాన్షియల్ ఇయర్లో కొత్త అంచనాల ప్రకారం రాష్ట్రాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.15.49 లక్షల కోట్లకు పెంచారు. ఇది 2022 ఫైనాన్షియల్ ఇయర్ అంచనాల కంటే 15.7శాతం, 2021 ఫైనాన్షియల్ ఇయర్ కంటే 22.1శాతం ఎక్కువ. మరోసారి సెకండ్ వేవ్ మాదిరి భారీగా మహమ్మారి వస్తే తప్ప తాజా ఫైనాన్షియల్ ఇయర్లో ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం లేదని ఇండ్-రా తెలిపింది. తాజా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.15.56 లక్షల కోట్లు బదిలీ చేసింది. 2022 ఫైనాన్షియల్ ఇయర్ అంచనాల కంటే ఇది 0.4శాతం ఎక్కువ.