లండన్: 178 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్ ట్రావెల్ కంపెనీ థామస్ కుక్ ఆర్థిక సమస్యలతో దివాలా తీసిన్నట్టు ప్రకటించింది. అదనపు నిధుల కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవడం ఇందుకు కారణం. ఈ మేరకు చాప్టర్ 15 ప్రొసీడింగ్స్‌ను ఫైల్ చేసింది. సోమవారం లండన్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ కంపెనీ ద్వారా విహారయాత్రలకు, విదేశాలకు వెళ్లిన ఆరు లక్షల మంది ఎక్కడికక్కడే ఇరుక్కు పోయారు. వీరిని సురక్షితంగా ఇళ్లకు తీసుకొస్తామని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భరోసా ఇచ్చారు. కంపెనీని గట్టెంక్కించడానికి 187 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,326 కోట్లు) బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వాలన్న థామస్ కుక్ రిక్వెస్ట్‌ను బ్రిటన్ తోసిపుచ్చింది. ఇలా చేయడం వల్ల నైతిక పరమైన ఇబ్బందులు వస్తాయని పేర్కొంది. ‘‘ఇది ఇబ్బందికర పరిస్థితి. ఇతర దేశాలకు వెళ్లి సొంతదేశానికి రాలేకపోతున్న థామస్‌కుక్ కస్టమర్ల గురించి ఆలోచిస్తున్నాం. వారందరినీ ప్రత్యేక విమానాల్లో ఇళ్లకు తీసుకొస్తాం’’ అని బోరిస్ చెప్పారు.
ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా…
1841లో ప్రారంభమైన థామస్‌కుక్ మొదట్లో రైలు ఎక్స్‌కర్షన్లను నిర్వహించేంది. రెండు ప్రపంచ యుద్ధాల వల్ల ఎన్నో కష్టనష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడగలిగింది. ఈ కంపెనీ హోటళ్లను, రిసార్టులను నిర్వహిస్తుంది. విమానాలను నడుపుతుంది. 16 దేశాల్లో 1.9 కోట్ల మంది పర్యాటకులకు సేవలు అందిస్తుంది. థామస్‌కుక్ ద్వారా ఇటీవల ఆరు లక్షల మంది విదేశాలకు వెళ్లారు. ప్రభుత్వం, ఇన్సూరెన్స్ కంపెనీలు వీరిని ఆదుకోవాల్సి ఉంటుంది. తమ లెండర్లు సహాయక ప్యాకేజీ ఇవ్వకపోవడం వల్లే దివాలా ప్రకటించాల్సి వచ్చిందని సీఈఓ పీటర్ ఫాంక్‌హాసర్ చెప్పారు. తమ కస్టమర్లకు, ఉద్యోగులకు, బిజినెస్ పార్టనర్లకు ఆయన క్షమాపణలు చెప్పారు. బ్రిటన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ) సీనియర్ ఆఫీర్లు స్పందిస్తూ థామస్‌కుక్ మూతబడిందని, దాదాపు 1.50 లక్షల మంది బ్రిటిష్ కస్టమర్లను వెనక్కి రప్పించడానికి ప్రత్యేక విమానాలను పంపిస్తామని వెల్లడించారు.రెండు వారాల్లో ఈ పని పూర్తవుతుందని అన్నారు.ఎయిర్‌పోర్టుల్లో ఖాళీగా పడున్న థామస్‌కుక్ విమానాలను ఫొటోలను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ కంపెనీ విమానాలన్నీ రద్దయ్యాయని సీఏఏ ప్రకటించింది. థామస్‌కుక్ ద్వారా హోటళ్లు బుక్ చేసుకున్న కస్టమర్ల బిల్లులను ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చెల్లిస్తామని తెలిపింది.
ఇప్పుడు ఏం జరగొచ్చంటే…
గోవా, గాంబియా, గ్రీస్‌కు వెళ్లిన థామస్‌కుక్ పర్యాటకులకు ఇప్పటికీ హోటల్ బిల్లులు చెల్లించలేదు. దీంతో వాళ్లు తీవ్ర ఇబ్బందుల పాలయ్యేఅవకాశాలు ఉన్నాయి. స్పెయిన్, టర్కీ వంటి దేశాల్లో థామస్‌కుక్‌కు భారీగా కస్టమర్లు ఉన్నారు. అక్కడి పర్యాటకరంగాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. బ్రిటన్‌లోని వందలాది ట్రావెల్ ఏజెంట్లు వ్యాపారాన్ని ఆపేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీకి దాదాపు 2.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.14 వేల కోట్లు) అప్పులు ఉన్నాయి. 16 దేశాల్లో 21 వేల మంది పనిచేస్తున్నారు.
వీరంతా ఉపాధి కోల్పోయే అవకాశాలే ఎక్కువ.
ఇండియాలో థామస్‌కుక్ కొనసాగుతుంది
బ్రిటన్‌లో థామస్ కుక్ మూతపడ్డప్పటికీ, మనదేశంలో థామస్ కుక్ (ఇండియా) కొనసాగుతుందని ఈ కంపెనీ ప్రకటించింది. బ్రిటన్ కంపెనీతో తమకు సంబంధం లేదని తెలిపింది. కెనడాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ ఫేర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్ 2012లో ఇండియా విభాగంలో 77 శాతం వాటా కొంది.
తదనంతరం మిగతా వాటాలను కూడా ఫేర్‌ఫాక్స్‌కు బదిలీ చేసింది. ప్రస్తుతం ఇందులో యూకే థామస్‌కుక్‌కు వాటాలు లేవు. గత ఏడేళ్లుగా తాము ఎంతో డెవెలప్‌అవుతున్నామని థామస్ కుక్ (ఇండియా) సీఎండీ మాధవన్ మేనన్ అన్నారు. ఆదాయాలు పెంచుకొని లాభాలు సాధిస్తున్నామని చెప్పారు.
దివాలాకు కారణాలు
- థామస్‌కుక్‌కు యూరపేఅతిపెద్ద మార్కెట్ అయితే గత పదేళ్లుగా అక్కడ పర్యాటక రంగం బాగాలేదు. భారీ ఆఫర్లను కూడా ప్రజలు పట్టించుకోవడం మానేశారు.
- వ్యాపారం తగ్గడమేగాక నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. గత ఏడాదిలో కంపెనీ 500 రీజనల్ ఆఫీసుల్లో ఒక్కో ఉద్యోగి సంపాదించిన మొత్తం 188 పౌండ్లు కూడా దాటలేదు.
- యూరప్‌లో గత ఏడాది వేడిగాలులు రావడంతో బుకింగ్స్‌ను రద్దు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో తక్కువ ధరలకు విమానాల టికెట్లు దొరకడం, ట్రావెల్ మార్కెట్లో విపరీతమైన మార్పులు రావడం, వివిధ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితుల వల్ల కూడా నష్టాలు పెరిగాయి. బ్రెగ్జిట్ వల్ల దీని బుకింగ్స్ చాలా తగ్గాయి.
- అప్పుల నుంచి గట్టెక్కడానికి కంపెనీ తన వాటాదారు ఫోసన్‌ను 900 మిలియన్ పౌండ్ల అప్పు అడిగింది. ఇందుకు ఫోసన్ అంగీకరించింది. మరో 200 మిలియన్ పౌండ్లు కూడా ఇవ్వాలని చివరి నిమిషంలో అడగ్గా, డీల్ బెడిసి కొట్టింది.

