ఆ స్కీమ్​లు బీఆర్​ఎస్​ హయాంలోనే ఆగినయ్​

ఆ స్కీమ్​లు బీఆర్​ఎస్​ హయాంలోనే ఆగినయ్​

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవని తేలిపోయింది. కేసీఆర్ ​చేసిన ఆరోపణల్లో ఒక్క నిజం కూడా లేదని, ఆ పథకాలన్నింటినీ బీఆర్ఎస్​ హయాంలోనే పెండింగ్​లో పెట్టినట్టు వెల్లడైంది. ఇటీవల కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో  ప్రభుత్వం అధికారుల నుంచి వివరాలు తెప్పించుకున్నది. ఈ పథకాల వివరాలన్నింటినీ ఉన్నతాధికారులు సీఎం రేవంత్​కు రిపోర్ట్​ రూపంలో అందించారు. ఆడబిడ్డ పెండ్లికి ఇచ్చే ‘కల్యాణ లక్ష్మి’ అప్లికేషన్లు నిరుడు జనవరి నుంచి రాష్ట్రంలో కొత్త  ప్రభుత్వం ఏర్పడే నాటికే లక్ష పెండింగ్​లో ఉన్నట్టు రిపోర్ట్​లో పేర్కొన్నారు. అదే సమయంలో గొర్రెల పంపిణీ కోసం కట్టిన డీడీలు కూడా గతేడాది పాత సర్కార్​లో తీసుకున్నవేనని స్పష్టం చేశారు. ఈ స్కీమ్​లో అవినీతి జరిగిందని, ఇప్పటికే ఏసీబీ కేసు నమోదైందని పేర్కొన్నారు. దళితబంధు పథకాన్ని పైలెట్​స్టేజ్​లోనే నిలిపివేశారని, రెండేండ్లుగా ఈ స్కీమ్​ పట్టాలెక్కలేదని వివరించారు.  రైతుబీమా కింద నమోదయ్యే మరణాలను రైతు ఆత్మహత్యల కింద చెబుతున్నట్టు ఆఫీసర్లు పేర్కొన్నారు.  బతుకమ్మ చీరల బకాయిలు కూడా గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో రిలీజ్​ కాలేదని తెలిపారు. కాగా, వీటన్నింటినీ ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచాలని మంత్రులకు సీఎం రేవంత్​ ఆదేశించినట్టు తెలిసింది. 

కల్యాణ లక్ష్మి.. రూ.వెయ్యి కోట్లు బాకీ

కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి  గతేడాది జనవరి నుంచి కాంగ్రెస్​ అధికారం చేపట్టే డిసెంబర్​ 7వ తేదీ నాటికి లక్షపైనే అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నట్టు అధికారులు నివేదించారు. వీటికి సంబంధించి ఏకంగా రూ.1000 కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. ఎన్నికల కోడ్​ లోపే రిలీజ్​ చేసేందుకు నిధులు కేటాయించాలని గత ప్రభుత్వాన్ని సెప్టెంబర్​లోనే కోరినా.. పైసా ఇవ్వలేదని తెలిపారు. దీంతో మరిన్ని అప్లికేషన్లు పేరుకుపోయాయని పేర్కొన్నారు. ఎమ్మార్వో స్థాయి వెరిఫికేషన్​లో దాదాపు 30 వేలు ఉండగా, ఆర్డీవో స్థాయిలో మరో 55 వేల అప్లికేషన్లు ఉన్నాయి. ట్రెజరరీలో బిల్లులు సాంక్షన్​ కాకుండా 20 వేల పైనే ఉన్నట్టు అధికారులు తెలిపారు. కల్యాణలక్ష్మికి సంబంధించి బడ్జెట్​లో పెటుకున్న మేరకు ఆర్థిక శాఖ ప్రతి ఏటా మొదటి నెలలో బీఆర్వోలను ఇస్తోంది. అయితే, ఆ మేరకు నిధుల సర్దుబాటు మాత్రం చేయలేదని పేర్కొన్నారు. 2023–24 కు సంబంధించి కల్యాణ లక్ష్మి పథకానికి రూ.3,210 కోట్లు కేటాయింపులు చేశారు. నిధులు నెలానెలా కొంత మొత్తం చెల్లింపులు చేయాల్సి ఉన్నా.. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ స్థాయిలో ఇవ్వలేదు. ఫలితంగా ఒక్క అప్లికేషన్​కు  ఏడాది దాటితే కానీ చెక్కులు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని  అధికారులు రిపోర్ట్​లో వివరించారు. 

రెండేండ్లుగా కాగితాల్లోనే దళితబంధు.. 

గత ప్రభుత్వం రెండేండ్లుగా దళితబంధు పథకాన్ని అమలు చేయడం లేదని.. బడ్జెట్లో నిధుల కేటాయింపులు తప్ప ఒక్క పైసా రిలీజ్​ చేయలేదని అధికారులు రిపోర్ట్​లో వెల్లడించారు. దాంతో దాదాపు రూ.35 వేల కోట్ల నిధులు కొలాప్స్​ అయినట్టు పేర్కొన్నారు. దళితబంధు స్కీమ్​ కింద  బీఆర్​ఎస్​ ప్రభుత్వం 2022–23లో 1500 మంది లబ్ధిదారులకు రూ.17,700 కోట్లు కేటాయించింది.  2023-–24   బడ్జెట్​లోనూ అంతే కేటాయింపులు చేశారు.  ఈ లెక్కన దళితబంధు స్కీంకు రెండేండ్లలో రూ.35 వేల కోట్లు.. దాదాపు మూడున్నర లక్షల మంది లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉండగా.. ఒక్కరికి కూడా ఇవ్వలేదని అధికారులు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలకు సంబంధించి బకాయిలను కూడా తీర్చలేదు.  నవంబర్ 2023 వరకు సుమారుగా 488.38 కోట్లు వస్త్రాలకు సంబంధించి టెస్కోకు బకాయి పడింది. 

వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

కేసీఆర్​ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. ఆయా శాఖలవారీగా గత ప్రభుత్వం ఏమేమి స్కీంలు.. ఎంత ఆలస్యం చేసింది ? ఎన్ని నిధులు ఖర్చు చేసిందనే వివరాలతో బీఆర్ఎస్ అబద్దాలను తిప్పికొట్టాలని తెలిపారు. ఇష్యూస్​ డైవర్ట్​ చేయడానికి  కేసీఆర్​ఎంతటి అబద్ధాన్నైనా చాకచక్యంగా చెప్పగలుగుతారని.. ఈ విషయంలో కాంగ్రెస్​ క్యాడర్, ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పినట్టు తెలిసింది. 

 డీడీలు కట్టించుకున్నరు.. వదిలేసిన్రు

రెండో విడత గొర్రెల పంపిణీకి సంబంధించి 2018 నుంచి 2023 వరకు దాదాపు నాలుగున్నరేండ్లు ఎలాంటి ప్రాసెస్​ చేయలేదని అధికారులు రిపోర్ట్​లో నివేదించారు. బై ఎలక్షన్స్​ జరిగిన రెండు నియోజకర్గాల్లో తప్పితే నాలుగేండ్లుగా ఎక్కడా పంపిణీ చేయలేదని వెల్లడించారు. నిరుడు జూన్‌‌‌‌‌‌‌‌లో రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభిస్తున్నట్టు అప్పటి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్ ప్రకటించిందని.. అప్పుడే గొర్రెలు వస్తాయన్న ఆశతో రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది డీడీలు కట్టారని వివరించారు.  లబ్ధిదారు వాటా కింద దాదాపు 85 వేల మంది రూ.43,750 చొప్పున బ్యాంకుల్లో డీడీలు తీశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం వీరికి గొర్రెల పంపిణీ చేయలేదని.. చివరలో ఎలక్షన్​ కోడ్​ పేరుతో కంటిన్యూ స్కీం అయినా ముందుకు తీసుకెళ్లలేదని నివేదించారు. గొర్రెల పంపిణీలో అవినీతి, అక్రమాలు జరిగినట్టు గుర్తించామని.. విజిలెన్స్​ఎంక్వైరీతో పాటు ఏసీబీ కేసు కూడా నమోదైందన్నారు. డీడీలు కట్టిన వాళ్లకు డబ్బులు తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. కొత్త ప్రభుత్వంలో గొర్రెల పంపిణీకి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రతిపాదనలు రెడీ అవుతున్నట్టు తెలిపారు.

రైతు ఆత్మహత్యలుగా రైతు బీమా మరణాలు.. 

రైతు ఆత్మహత్యలపై  కేసీఆర్ చేసిన​ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అధికారులు రిపోర్ట్​లో నివేదించారు. గత ప్రభుత్వం నుంచే అమలవుతున్న రైతుబీమా మరణాలను పరిగణనలోకి తీసుకుని వాటిని కూడా ఆత్మహత్యలుగా చెబుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం అసలు రైతు ఆత్మహత్యలను నమోదు చేయడం నిలిపివేసిందని పేర్కొన్నారు. రైతుబీమాలోనే అదర్స్​(ఇతర కారణాలు) పేరుతో ఎంట్రీ చేసి, ఆత్మహత్యల లెక్కలు బయటకు రాకుండా చేశారని వివరించారు. 2018 ఆగస్టు 15 నుంచి  2023 ఆగస్టు నాటికి   ఐదేండ్లలో వివిధ కారణాలతో 1,08,051 మంది రైతులు చనిపోయారు. ఇందులోనే ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు కూడా ఉన్నాయని.. అయితే అవన్నీ ఇతర కారణాల పేరుతో ఎంట్రీ చేసినట్టు చెప్పారు. మూడు నెలల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే దాంట్లో వాస్తవం లేదని.. క్షేత్రస్థాయి అధికారుల రిపోర్టుల ప్రకారం వ్యవసాయ సంబంధిత కారణాలతో రైతు ఆత్మహత్యలు లేవని వెల్లడించారు.