ఆప్తుల కోసం శిథిలాల కింద వెతుకులాట

ఆప్తుల కోసం శిథిలాల కింద వెతుకులాట

గాజా/జెరూసలెం: హమాస్ మిలిటెంట్లను వేటాడుతూ ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు కొనసాగిస్తుండటంతో గాజా లోని అనేక ప్రాంతాలు శిథిలాల కుప్పగా మారిపోయాయి. నలబై రోజులుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) బాంబు దాడుల్లో గాజా సిటీలో చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్​పై దాడికి తెగబడి 1200 మందిని హమాస్ మిలిటెంట్లు హతమార్చారు. 240 మందిని బందీలుగా పట్టుకెళ్లారు. 

దీంతో మిలిటెంట్లను తుదముట్టించడమే లక్ష్యంగా ఐడీఎఫ్​ ప్రతి దాడులు చేస్తోంది. ఇప్పటివరకు యుద్ధంలో 11,400 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. మరో 2,700 మంది ఆచూకీ తెలియడంలేదు. గాజాలో కరెంట్ సప్లై ఆగిపోవడం, ఇంధనం అయిపోవడంతో బుల్డోజర్లు, క్రేన్లు, ఇతర వెహికల్స్ అన్నీ ఎక్కడివక్కడే మూలనపడ్డాయి. సహాయక చర్యలకు వినియోగించాల్సిన చాలా వెహికల్స్ ధ్వంసమయ్యాయి. దీంతో శిథిలాలను తొలగించేందుకు వాటిని ఉపయోగించుకునే పరిస్థితి లేదని పాలస్తీనియన్ సివిల్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడుల్లో కుటుంబాలకు కుటుంబాలే అంతమైపోతుండగా.. మిగిలినవారు రోజూ వట్టి చేతులతో పారలతో శిథిలాలను తొలగిస్తూ తమ ఆప్తుల కోసం వెతుకుతున్నారని తెలిపారు.  

ఇద్దరు బందీలను చంపేసిన మిలిటెంట్లు 

హమాస్ మిలిటెంట్ల చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ మహిళా జవాన్​తో పాటు మరొకరిని మిలిటెంట్లు చంపేశారని ఐడీఎఫ్ శుక్రవారం వెల్లడించింది. కార్పోరల్ నోవా మార్సియానో(19) మృతదేహం అల్ షిఫా ఆస్పత్రి పక్కన దొరికిందని తెలిపింది. అక్టోబర్ 7న ఈమెను మిలిటెంట్లు కిడ్నాప్ చేశారని, ఇప్పుడు హత్య చేసి మృతదేహాన్ని అక్కడ పడేశారని పేర్కొంది. యెహూదిట్ వీస్(65) అనే మహిళను కూడా మిలిటెంట్లు చంపారని, ఆమె డెడ్ బాడీని కూడా ఓ ఆస్పత్రి పక్కన పడేశారని ఐడీఎఫ్ తెలిపింది. వీస్ భర్తను అక్టోబర్ 7న హత్య చేసి, ఆమెను మిలిటెంట్లు బందీగా తీసుకెళ్లారని వెల్లడించింది. అలాగే గాజాలో మిలిటెంట్ల వేట కొనసాగుతోందని ఐడీఎఫ్ పేర్కొంది.