ట్రిపుల్ ఆర్ కింద తొలగిస్తున్న..వేలాది సీతాఫలం చెట్లకూ పరిహారం

ట్రిపుల్ ఆర్ కింద తొలగిస్తున్న..వేలాది సీతాఫలం చెట్లకూ పరిహారం
  • ట్రిపుల్ ఆర్​కింద పోతున్న వేలాది సీతాఫలం చెట్లు 
  • పండ్ల చెట్టుకు ఓ రేటు.. ఇతర చెట్లకు మరో రేటు

 యాదాద్రి, వెలుగు : ట్రిపుల్​ ఆర్ కింద  తొలగించాల్సివస్తున్న వేలాది చెట్లకు ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. చెట్ల రకాలనుబట్టి  పరిహారం నిర్ణయించారు.  యాదాద్రి జిల్లాలో ట్రిపుల్  ఆర్​ 59.33 కిలో మీటర్ల మేర నిర్మించనున్నారు. ఇందుకోకు అవసరమైన భూసేకరణ కోసం మూడు  'కాలా'(కాంపెటెంట్​ అధారిటీ ఫర్​ ల్యాండ్​ అక్విజేషన్)లను ఏర్పాటు చేశారు.  జిల్లాలో  1795 ఎకరాల భూమి సేకరించాల్సిఉంది.   భువనగిరి కాలా పరిధిలో రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తుండగా..  తుర్కపల్లి, చౌటుప్పల్​ కాలాల పరిధిలోని నాలుగు మండలాల్లో సర్వే ముగిసింది.  తుర్కపల్లి 'కాలా' పరిధిలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో సర్వే ముగియగా.. ఆ భూముల్లోని బోర్లు, బావులు, చెట్లు, కట్టడాలకు సంబంధించిన స్టక్చర్​ ఎంక్వైరీ కూడా పూర్తయ్యింది.   

చౌటుప్పల్​ కాలా పరిధిలో వలిగొండ, చౌటుప్పల్​ మండలాల్లో కొంతమేర సర్వే పూర్తికాగా.. స్థానికులు  సర్వేకు అంగీకరించక పోవడంతో కొన్నిచోట్ల ఆపివేశారు.  రోడ్డు కోసం సేకరిస్తున్న భూముల్లో పండ్ల తోటలు, తాటి, ఈత చెట్లు, ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​కు చెందిన  చెట్లు మొత్తం  7,590 ఉన్నాయి. ఆర్​డబ్ల్యూఎస్​ పరిధిలోని 388 చెరువులు, బావులు, బోర్లు, పైపులైన్లు  తొలగించాల్సి ఉంది.  ఆర్​అండ్​బీ పరిధిలోకి వచ్చే  354 ఆలయాలు, ఇండ్లు, షెడ్స్​, ఫౌల్ట్రీ ఫామ్స్​, కంపౌండ్ వాల్స్​, ఫెన్సింగ్​ , సమాధులు ఉన్నాయి.  

ఒక్కో చెట్టుకు ఒక్కో రకమైన పరిహారం

సేకరించే భూముల్లోని చెట్లను వివిధ రకాలుగా విభజిస్తారు. చెట్లున్న ఏరియా,  ఎకరానికి ఎన్ని చెట్లున్నాయి,   చెట్ల వయసు, చెట్ల ద్వారా వస్తున్న ఆదాయం తదితర అంశాల ఆధారంగా పరిహారం ఖరారు చేశారు.  దీనికి   రెట్టింపు మొత్తాన్ని చెట్ల యజమానులకు అందిస్తారు. ఉత్పత్తికి ముందు, ప్రాథమిక దశలో ఉన్న చెట్లను మూడు కేటగిరిలుగా విభజించారు. వీటిలో సీ కేటగిరిలోని చెట్టు రకాన్ని బట్టి రూ. 41 నుంచి రూ. 321 పరిహారం అందిస్తారు. బీ కేటగిరిలోని చెట్లకు రూ. 53 నుంచి రూ. 496 అందిస్తారు. ఏ కేటగిరిలో చెట్లకు రూ. 67 నుంచి 620 వరకూ అందిస్తారు.

 ఉత్పత్తి ద్వారా ఆదాయం అందిస్తున్న చెట్లను కూడా మూడు కేటగిరిలుగా విభజించారు. సీ కేటగిరిలో చెట్లకు రూ. 120  నుంచి రూ. 1605, బీ కేటగిరిలోని చెట్లకు రూ.181 నుంచి రూ. 2140 వరకూ, ఏ కేటగిరిలోని చెట్లకు రూ. 187 నుంచి 2675 వరకూ పరిహారం అందిస్తారు. 

సీతాఫలం చెట్టుకు కూడా

 గతంలో సీతాఫలం చెట్లకు పరిహారం ఇచ్చేవారు కాదు. కానీ ఈసారి వాటికి కూడా పరిహారం అందించనున్నారు.  చిన్న చెట్లకు సీ కేటగిరిలో రూ. 61 ,   బీ కేటగిరిలో రూ. 81, ఏ కేటగిరిలో రూ. 101 పరిహారం ఇవ్వనున్నారు.   పెద్ద చెట్లో సీ కేటగిరికి రూ.112, బీ కేటగిరికి రూ. 150, ఏ కేటగిరికి రూ. 187గా నిర్ణయించారు. పండ్ల చెట్లలో మామిడికే ఎక్కువ పరిహారం ఇవ్వనున్నారు.  ఉత్పత్తికి ముందు మూడు కేటగిరిల్లో రూ.321, రూ. 428, రూ, 536గా నిర్ణయించారు. ఆదాయం అందిస్తున్న చెట్లలో  సీ కేటగిరిలో రూ. 1605, బీలో 2140, ఏ కేటగిరిలో 2675గా నిర్ణయించారు. 

 కల్లుగీసే తాటి చెట్టుకు రూ. 1968, ఈత చెట్టుకు రూ. 1070గా నిర్ణయించారు. ఈ పరిహారంలో భూ యజమానికి సగం, కల్లుగీత సొసైటీకి సగం పరిహారం అందిస్తారు. గీత కార్మికుడి సొంత భూమిలో తాటి, ఈత చెట్లు ఉన్నట్టయితే మొత్తం పరిహారం అతడికే అందిస్తారు.