యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. కొండ కింద లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, వ్రత మండపం, కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడాయి.
రద్దీ కారణంగా స్వామివారి ధర్మ దర్శనానికి రెండు గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట సమయం పట్టింది. భక్తులు సొంత వాహనాల్లో రావడంతో పార్కింగ్ ప్లేస్ నిండి రింగు రోడ్డు, ఘాట్ రోడ్డు సర్కిల్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. స్వామివారిని రెరా చైర్మన్ సత్యనారాయణ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.53,22,872 ఆదాయం వచ్చింది.
