వేలల్లో ఆన్​లైన్ యాప్​లు.. లక్షల్లో బాధితులు!​   

V6 Velugu Posted on Nov 26, 2021

  • పెరుగుతున్న ఆన్​లైన్​ మోసాలు   
  • ఈజీ మనీపై ఆశ ఉన్నోళ్లే టార్గెట్

ఖమ్మం నగరానికి చెందిన సురేష్(పేరు మార్చాం) ఈజీ మనీ కోసం ఇటీవల ఓ యాప్​ లో జాయిన్​ అయ్యాడు. రూ.10 వేలు, 20 వేలు, 80 వేల చొప్పున అందులో ప్యాక్​ లు ఉంటాయి. క్యాష్ రీచార్జ్​ చేసుకొని జాయిన్​ అయితే ఒక టాస్క్​ ఇస్తారు. రోజుకు 10 నుంచి 15 యూట్యూబ్ వీడియోలు పంపిస్తారు. ఆ వీడియోలను లైక్​ చేసి, ఛానల్ ను సబ్ స్క్రయిబ్​ చేసి టెలిగ్రామ్​లో స్క్రీన్​ షాట్ పంపాలి. వెంటనే ఒక్కో సబ్ స్క్రయిబ్​కు రూ.200 నుంచి 300 వరకు మనీ రిటర్న్​ వస్తాయి. ఇలా రూ.2 వేల నుంచి 3 వేల వరకు డైలీ పేమెంట్ వచ్చింది. చైన్ లింక్​ స్కీమ్​లో మరికొందరిని చేర్పిస్తే వాళ్ల మనీలో రూ.20 శాతం కమీషన్​ వచ్చేది. వెంట వెంటనే రిటర్న్స్​వస్తుండడంతో సురేష్​ రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉన్న ప్యాక్​లలో తనకు తెలిసిన వారిని చేర్పించాడు. చాలామందిని చేర్పించిన తర్వాత యాప్​ పనిచేయకపోవడంతో ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. 

ఖమ్మంలో ఓ పెద్ద వ్యాపారికి ఇటీవల ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆన్​లైన్​యాప్​లో పెట్టుబడితో ఈజీగా లక్షల రూపాయలు సంపాదించవచ్చని మోటివేట్ చేశాడు. దీంతో రూ. లక్ష ఇన్వెస్ట్ చేశాడు. యూట్యూబ్​లింక్​లు క్లిక్​చేయడం, సబ్ స్క్రయిబ్​ చేయడంతో మూడు రోజుల్లోనే యాప్​లో డబ్బులు డబుల్ అయ్యాయని కనిపించింది. తర్వాత రూ. 2 లక్షలను ఇన్వెస్ట్ చేస్తే మళ్లీ డబుల్ అయ్యాయి. దీంతో ఆశ పుట్టి తన ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో బ్యాంక్​అకౌంట్లలో ఉన్న మొత్తం రూ.25 లక్షలను ఒకేసారి ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత యాప్​ పనిచేయడం మానేసింది. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఖమ్మం, వెలుగు: ఆన్​లైన్​మోసాలు, చైన్​ లింక్​ స్కీమ్​ల గ్యాంబ్లింగ్, సైబర్​ నేరగాళ్ల చీటింగ్ వంటి అంశాలపై ఎప్పటికప్పుడు పోలీసులు అలర్ట్ చేస్తున్నా, ఈజీ మనీపై ఆశతో వాటిని నమ్మి మోసపోతున్న ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. యాప్​లో జాయినై యూట్యూబ్​ వీడియోలపై లైక్​ చేస్తే లక్షలు వస్తాయని, యూట్యూబ్ చానల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకుంటే నెలకు గవర్నమెంట్ శాలరీని మించి సంపాదించుకోవచ్చని సైబర్​ నేరగాళ్లు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్​ ప్రచారాలను, వాట్సప్​ లో వస్తున్న నకిలీ లింక్​ లను నమ్మి మోసపోతున్న వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆన్​ లైన్​లో వేల సంఖ్యలో ఉన్న ఫేక్​ యాప్స్​ తో మోసగాళ్లు ఎరవేస్తున్నారు. దీనిపై అవేర్​నెస్​ క్రియేట్ చేయడానికి పోలీసులు ఎంత ప్రయత్నం చేస్తున్నా, బాగా చదువుకున్నవాళ్లు కూడా మోసపోయామంటూ ఆలస్యంగా ఖాకీలను అప్రోచ్​అవుతున్నారు. ఇక ఇటీవల మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బేస్​ చేసుకొని క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ మెంట్ అంటూ మోసం చేస్తున్న ఆన్ లైన్​యాప్​లు కూడా ఉన్నాయి. 

రూ. 3 కోట్ల వరకు లాస్​
ఖమ్మం నగరానికి చెందిన గుండెమెడ రామలింగస్వామి(36) క్రిప్టో కరెన్సీలో దాదాపు రూ.3 కోట్ల వరకు నష్టపోయి రెండ్రోజుల క్రితం సూర్యాపేటలోని లాడ్జిలో సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. రామలింగస్వామితో పాటు ఖమ్మం నగరానికి చెందిన దాదాపు 20 మంది కలిసి క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసి నష్టపోయినట్టు తెలుస్తోంది. దాదాపు ఏడాది కాలం నుంచి క్రిప్టో కరెన్సీకి సంబంధించిన యాప్​లు, వెబ్ సైట్ లలో రామలింగస్వామి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఈజీ మనీ కాన్సెప్ట్ తో మొదట ఈఎస్ పీఎన్​ గ్లోబల్ ఇన్వెస్ట్ పేరుతో ఉన్న ఒక బిజినెస్​ లో చేరాడు. చైన్​లింక్ స్కీమ్​లో ఉండే ఈ వ్యాపారంలో ఎక్కువ లాభాలు రావాలంటే ఒకరు ఇద్దరిని చేర్పించడం, వాళ్లిద్దరు మరో నలుగురిని.. ఇలా చేర్పించాడు. ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ దాదాపు రూ.25 లక్షల వరకు క్రమంగా ఇన్వెస్ట్ చేసి, మరికొంత మందిని చేర్పించాడు. మధిర, సత్తుపల్లి ప్రాంతానికి చెందిన కొందరు ప్రైవేట్ టీచర్లు కూడా ఇందులో చేరి బాధితులుగా మారినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అలాంటి మరో మూడు నాలుగు యాప్​లలో ​డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు. ఇలా తన సొంత డబ్బు, ఇతరుల నుంచి తీసుకున్న డబ్బు, వాళ్లతో కలిసి జాయిన్​ చేయించిన డబ్బు మొత్తం రూ.3  కోట్ల వరకు రామలింగస్వామి నష్టపోయాడని ఆయన ఫ్రెండ్స్​చెబుతున్నారు. 

ప్రజల అవగాహనకు ‘సైబర్​దోస్త్’​
ఖమ్మంలో కరోనా లాక్​ డౌన్​టైంలో కొంతమంది ప్రైవేట్ టీచర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్ మెంట్ తో ఉన్న యాప్​లలో రూ.లక్షన్నర, రూ. 3 లక్షలు, రూ.5 లక్షల ప్యాకేజీలలో జాయిన్​ అయ్యారు. వారికి మొదట కొద్ది రోజులు లాభాలు వచ్చాయి. అయితే విత్ డ్రా ఆప్షన్లు నిలిచిపోవడం, డబ్బులు తిరిగి తీసుకునే ఛాన్స్ లేకపోవడంతో చాలామంది నష్టపోయారు. నగరంలోని గాంధీ చౌక్ కు చెందిన వ్యాపారులు కూడా ఇలా మోసపోయినవారిలో ఉన్నట్టు సమాచారం.​ ఇలాంటి వారిలో కొందరు పోలీసులకు కంప్లైంట్ చేస్తుండగా, మరికొందరు పరువు పోతుందేమోనని భయపడి ఫిర్యాదు కూడా చేయడం లేదు. దీనిపై ఖమ్మం కమిషనరేట్ పరిధిలో సైబర్​ దోస్త్ పేరుతో సోషల్ మీడియాలో జనాలను అలర్ట్ చేసే క్యాంపెయిన్​ నిర్వహిస్తున్నారు. సైబర్​ నేరాలపై దేశంలోనే మొదటిసారిగా ఖమ్మం జిల్లాలో పోలీసులు పైలట్​ప్రాజెక్టును చేపట్టారు. జిల్లా మొత్తం 2 వేల వాట్సప్​గ్రూప్​లలో సైబర్​దోస్త్ ఫోన్​నంబర్​యాడ్ చేశారు. ఫేక్​యాప్ లు, ఆన్ లైన్​మోసాలపై ఎప్పటికప్పుడు అవేర్ నెస్​ పోస్టులను ఫార్వర్డ్ చేస్తున్నారు. అయినా, బాగా చదువుకున్న వాళ్లు, ఇతర వ్యాపారాల్లో స్థిరపడినవారు కూడా ఇలాంటి మోసగాళ్ల మాయలో పడి రూ.లక్షల్లో నష్టపోతున్నారు. ఇటీవల రెగ్యులర్​గా ఇలాంటి మోసాలపై కంప్లైంట్స్ వస్తున్నాయని సైబర్​క్రైమ్​పోలీసులు చెబుతున్నారు. క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయంటూ మోసగించే యాప్​ లపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 

సైబర్​క్రైమ్స్​పై అవగాహన తప్పనిసరి
ఈజీ మనీ వస్తాయని చెప్పేవారి మాటలను ఎవరూ నమ్మవద్దు. అలాంటి యాప్​లు, మోసాలపై అలర్ట్ గా ఉండి అవగాహన పెంచుకోవాలి. వీడియో లింక్​లు, పరిచయం లేని వారు పంపించే సోషల్ మీడియా మెసేజ్​లను క్లిక్​చేయవద్దు. దేశంలోనే తొలిసారిగా ఖమ్మం జిల్లాలో సైబర్​క్రైమ్స్​పై అవేర్ నెస్​క్యాంపెయిన్​చేస్తున్నాం. సైబర్ దోస్త్ పైలట్ ప్రాజెక్టు తో ఒకేసారి 2 లక్షల మందికి సోషల్ మీడియాలో మెసేజ్​లు పంపుతున్నాం. 
– విష్ణు ఎస్. వారియర్, సీపీ, ఖమ్మం

Tagged Telangana, Khammam, apps, online apps, Money Fraud, cyber dost

Latest Videos

Subscribe Now

More News