
ఖాట్మండు: టిబెట్‌లోని మౌంట్ ఎవరెస్ట్ ప్రాంతంలో తీవ్ర మంచు తుఫాన్ కారణంగా పర్వతానికి దగ్గరలో వెయ్యి మంది ట్రెక్కర్లు చిక్కుకుపోయారు. విపరీతంగా మంచు పేరుకుపోవడంతో మౌంటేన్‌కు వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోయాయి. దీంతో వారందరినీ వెనక్కి తీసుకువచ్చేందుకు వందలాదిమంది స్థానికులతో కలిసి రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి.
4900 మీటర్ల కంటే ఎత్తు ఉన్న ఈ ప్రాంతానికి చేరుకునే మార్గంలో పేరుకున్న మంచును తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. చిక్కుకుపోయిన పర్యాటకుల్లో కొంతమంది ఎవరెస్ట్‌కు దగ్గరలోని క్యాంప్‌లో తలదాచుకోగా, 350 మంది ట్రెక్కర్లను రెస్క్యూ బృందాలు కుడాంగ్ టౌన్‌షిప్‌కు తరలించాయి.
మరో 200 మందికిపైగా ట్రెక్కర్లను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రెస్క్యూ టీమ్స్ తెలిపాయి. కాగా, నేపాల్‌లోని లాంగ్‌టాంగ్ ప్రాంతానికి ట్రెక్కింగ్‌కు వెళ్లి వరదల్లో చిక్కుకున్న 16 మందిలో 12 మంది ట్రెక్కర్లను నేపాల్ సైనికులు కాపాడారు. బేరింగ్ ఖోలా నదిలో కొట్టుకుపోయిన మిగతా నలుగురి ఆచూకీ దొరకలేదని తెలిపారు.