మళ్లా ముంచుకొస్తోన్న కరోనా ముప్పు

మళ్లా ముంచుకొస్తోన్న కరోనా ముప్పు
  • రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలని కేంద్రం సూచన
  • చైనా సహా పలు దేశాల్లో పెరుగుతున్న కేసులు 
  • దేశంలో పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ హైలెవల్ మీటింగ్  
  • కరోనా ఇంకా పోలేదు.. అలర్ట్​గా ఉండాలని పిలుపు 

న్యూఢిల్లీ: కరోనా ముప్పు మళ్లా ముంచుకొస్తోంది. రద్దీ ప్రాంతాల్లో మళ్లా మాస్క్ లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తోంది. చైనా, జపాన్, అమెరికా, సౌత్ కొరియా, బ్రెజిల్ సహా పలు దేశాల్లో కరోనా వ్యాప్తి మరోసారి పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. మన దేశంలో కొత్త వేరియంట్లు విస్తరించకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసేందుకు బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఉన్నతాధికారులు, హెల్త్ ఎక్స్ పర్ట్ లతో హైలెవల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, ఈ మహమ్మారి ముప్పు ఇంకా పోలేదని హెచ్చరించారు. 

రద్దీ ప్రదేశాల్లో ప్రజలంతా మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. అందరూ వ్యాక్సిన్ లు వేసుకోవాలని చెప్పారు. ఇకపై కరోనా పరిస్థితులపై చర్చించి చర్యలు తీసుకునేందుకు ప్రతీ వారం సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అన్ని రాష్ట్రాలు కరోనాపై నిఘాను, టెస్టులను పెంచాలని సూచించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గత వారం రోజుల్లో రోజూ యావరేజ్ గా 5.9 లక్షల కేసులు నమోదవుతున్నాయని మాండవీయ తెలిపారు. మన దేశంలో ఈ నెల 19 నుంచి రోజూ యావరేజ్ గా 158 కేసులు వస్తున్నాయన్నారు. 

అందరూ ప్రికాషన్ డోస్ తీసుకోండి: వీకే పాల్  

మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం పట్ల ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు, నేషనల్ కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ వీకే పాల్ అన్నారు. రివ్యూ మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా టెస్టులను మళ్లీ పెంచుతున్నామని తెలిపారు. సీనియర్ సిటిజన్స్ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరూ ప్రికాషన్ డోస్ తీసుకోవాలని కోరారు. 

బూస్టర్​ డోసులకు క్యాంపులు!

హైదరాబాద్, వెలుగు: కరోనా కొత్త వేరియంట్లపై రాష్ట్ర ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. కేంద్రం ఆదేశాలతో రాష్ట్రంలో బూస్టర్ డోసు వ్యాక్సినేషన్‌‌ క్యాంపులు పెట్టాలని భావిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1.32 కోట్ల మంది బూస్టర్ డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంకో 2 కోట్ల మంది బూస్టర్ డోసు తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌‌పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, మాస్కుల వినియోగించేలా ప్రచారం చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. కరోనా టెస్టుల సంఖ్యనూ పెంచుతామని, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 

దేశంలో నాలుగు ఒమిక్రాన్ బీఎఫ్.7 కేసులు 

చైనాలో మళ్లీ కరోనా వ్యాప్తికి కారణమవుతున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 మన దేశంలోనూ ఉన్నట్లు హెల్త్ ఎక్స్ పర్ట్ లు గుర్తించారు. ఇప్పటివరకు దేశంలో మూడు బీఎఫ్.7 కేసులు నమోదయ్యాయని బుధవారం అధికారులు వెల్లడించారు. తొలి రెండు కేసులను జులై, అక్టోబర్ నెలల్లో గుజరాత్ లో బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ నిపుణులు గుర్తించారు. ఆ తర్వాత నవంబర్ లో ఒడిశాలో రెండు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.