- మహబూబాబాద్ జిల్లాలో తనకే ఓటేసినట్లు సేవాలాల్ జెండాపై ప్రమాణం చేయాలని ఒత్తిడి
- లేదంటే తాను ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్
- గద్వాల జిల్లాలో గెలిపించలేదన్న కోపంతో రోడ్డు క్లోజ్ చేసిన క్యాండిడేట్
- ఖమ్మం జిల్లాలో రీకౌంటింగ్ చేయాలని సెల్ టవర్ ఎక్కి హల్‌చల్
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయిన క్యాండిడేట్లు ప్రతీకార చర్యలు, బెదిరింపులకు దిగుతున్నారు. ఓ క్యాండిడేట్ తనకే ఓటేసినట్లు ప్రమాణం చేయాలని.. లేదంటే తాను ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఇంటింటికీ తిరిగి బెదిరిస్తుండగా.. మరో క్యాండిడేట్ రైతులకు ఉపయోగపడే రోడ్డును క్లోజ్ చేయించాడు. ఇంకో చోట రీకౌంటింగ్ చేయించాలని ఓ క్యాండిడేట్ సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. దీంతో ఎన్నికలన్నాక గెలుపోటములు సహజం.. కానీ ఇలా కక్ష సాధింపు చర్యలు ఏమిటని గ్రామస్తులు మండిపడుతున్నారు.
పైసలిస్తరా.. ప్రమాణం చేస్తరా..
మహబూబాబాద్, వెలుగు : సర్పంచ్‌గా పోటీచేసి ఓడిపోయిన క్యాండిడేట్ ఇంటింటికీ తిరుగుతూ తాను పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని గొడవకు దిగింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సోమ్లాతండాలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ సొంత ఊరైన సోమ్లాతండాలో ఆయన వదిన భూక్య కౌసల్య కాంగ్రెస్ తరఫున సర్పంచ్ బరిలో నిలువగా.. అదే తండాకు చెందిన ఇస్లావత్ సుజాత కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసింది.
గురువారం జరిగిన ఎన్నికల్లో సుజాత 17 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. దీంతో ఓడిపోయిన క్యాండిడేట్ భుక్యా కౌసల్య, ఆమె భర్త ధల్‌సింగ్, కొడుకు సందీప్ శుక్రవారం సేవాలాల్ జెండాతో తండాలో ఇంటింటికీ తిరుగుతూ... ఎన్నికలకు ముందు రోజు తాను ఓటుకు రూ. 1500, ఇంటికి ఓ కోడి పంచానని చెప్పారు. అయినా తనకు ఓటు వేయకపోవడం వల్లే ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రతి ఓటరును కలుస్తూ ‘మీరు నాకు ఓటు వేసినట్లు కులదైవమైన సేవాలాల్ జెండా పట్టుకొని ప్రమాణం చేయండి.. లేదంటే నేను పంచిన డబ్బులు నాకు ఇచ్చేయండి’ అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ‘పోటీ చేయొద్దని మేం ముందే చెప్పాం.. అయినా మీరు వినకుండా పోటీచేసి ఓడిపోయారు.. మేం డబ్బులు, కోడి ఇవ్వమని అడగ లేదు.. మాకు ఎందుకు ఇచ్చారు’ అంటూ తండావాసులు సమాధానం ఇవ్వడంతో ఇరువర్గాల మధ్య లొల్లి మొదలైంది. గొడవ పెద్దగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు తండాకు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఓట్లు వేయలేదని రోడ్డు క్లోజ్ చేసిన్రు
గద్వాల, వెలుగు : సర్పంచ్ ఎన్నికల్లో తనను గెలిపించలేదన్న కోపంతో ఓ క్యాండిడేట్ రైతులు ఉపయోగించుకునే రోడ్డును క్లోజ్ చేశాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం కోతులగిద్ద గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే...
కోతులగిద్ద గ్రామ సర్పంచ్ పదవి కోసం రంగస్వామి భార్య మహేశ్వరి, రంగన్న భార్య గోవిందమ్మ పోటీ పడగా.. 26 ఓట్ల మెజార్టీతో గోవిందమ్మ విజయం సాధించింది. దీంతో తమ కులస్తులే తమకు ఓట్లు వేయలేదన్న కోపంతో ఉన్న మహేశ్వరి కుటుంబ సభ్యులు.. రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు ఉపయోగించుకునే రోడ్డుపై మట్టి పోసి క్లోజ్ చేయించారు.
దీంతో దర్గా వాగు, నాటోం బావి, నక్కలగడ్డ వాగు సమీపంలోని పొలాలకు వెళ్లే 80 రైతు కుటుంబాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఓట్లు వేయలేదన్న కోపంతోనే రోడ్డును క్లోజ్ చేశారని, నిజానికి ఆ రోడ్డు తరతరాలుగా వాడుకుంటున్నదేనని.. ఆఫీసర్లు స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. ఇదే విషయాన్ని పోలీసుల దృష్టికి సైతం తీసుకెళ్లారు.
రీ కౌంటింగ్ చేయాలని టవర్ ఎక్కి హల్‌చల్
ఖమ్మం టౌన్, వెలుగు : పంచాయతీ ఎన్నికల ఓట్లను రీకౌంటింగ్ చేయాలంటూ ఓ ఇండిపెండెంట్ క్యాండిడేట్ భర్త సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హరియాతండాలో జరిగింది.
సర్పంచ్ పదవి కోసం కాంగ్రెస్ తరఫున బానోతు స్వాతి, ఇండిపెండెంట్‌గా మాలోతు చింత పోటీ చేయగా.. స్వాతి విజయం సాధించారు. అయితే గ్రామ పంచాయతీ పరిధిలోని సుఖినితండాలో 100 శాతం పోలింగ్ నమోదు కావడంపై చింత భర్త రంగ అనుమానం వ్యక్తం చేశాడు. సుఖిని తండాలో 170 ఓట్లు ఉండగా.. ఇందులో కొందరు చనిపోయారని, మరికొందరు శబరిమల వెళ్లారని.. అలాంటప్పుడు మొత్తం ఓట్లు ఎలా పోల్ అవుతాయని ప్రశ్నించాడు.
ఓట్లను మరోసారి లెక్కించాలని డిమాండ్ చేస్తూ సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తాను రూ. 4 లక్షలు ఖర్చు చేశానని, ఆఫీసర్లు స్పందించి ఓట్లను తిరిగి లెక్కించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్, సీఐ ఘటనాస్థలానికి చేరుకొని నచ్చజెప్పి కిందకు దించడంతో ఐదు గంటల ఉత్కంఠకు తెరపడింది. కాగా, రంగపై రఘునాథపాలెం పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

