- ముగ్గురు అసిస్టెంట్ లైన్ మెన్ల సస్పెన్షన్
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో కరెంట్ ఆఫీస్ లో మందు పార్టీ చేసుకోగా.. ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ముగ్గురు అసిస్టెంట్ లైన్‌మెన్లు సస్పెండ్ అయ్యారు. శనివారం రాత్రి జగిత్యాల సర్కిల్ టౌన్ –--1 సెక్షన్ స్టాఫ్ రూమ్ లో ముగ్గురు అసిస్టెంట్ లైన్ మెన్లు ఎ. ప్రభాకర్, జి. బాలకృష్ణ, వి. రాజశేఖర్ మందు పార్టీ చేసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై డీఈ గంగారాం స్పందించి ఎంక్వైరీ చేపట్టగా.. మందుపార్టీ నిజమేన తేలడంతో సస్పెండ్ చేశారు.
ఇదే విషయంపై ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి కూడా స్పందించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 సర్కిళ్లలోని ఏ సబ్‌స్టేషన్, ఆఫీసు, సంస్థ ప్రాంగణాల్లో అనైతిక చర్యలు, క్రమశిక్షణా రహిత ప్రవర్తన చర్యలకు పాల్పడితే ఉపేక్షించమని స్పష్టం చేశారు. తక్షణమే విధుల నుంచి తొలగిస్తామన్నారు. ఇందుకు సంబంధించి హెచ్ఆర్డీ విభాగం అడ్వైజరీ మెమో జారీ చేసినట్లు తెలిపారు.
