ఖైరతాబాద్, వెలుగు: లోన్లు ఇస్తమని ఫోన్ చేయిస్తరు. ఆ తర్వాత వెరిఫికేషన్ టీంను పంపిస్తరు. అంతా ఓకే అనుకుంటే చెక్ కలెక్షన్ టీంను పంపి, చెక్‌లను తీసుకుంటరు. చివరగా చెక్ విత్‌డ్రా టీంలను బ్యాంకులకు పంపి డబ్బు కాజేస్తరు. ఇదీ జనాన్ని రూ.50 లక్షలకు బురిడీ కొట్టించిన ఫేక్ సంస్థ బాగోతం. రెండు రోజుల్లోనే అంత మొత్తాన్ని కొట్టేసిన ఆ ఫేక్ సంస్థ ఓనర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను పోలీసులు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన మహేశ్ అలియాస్ శేఖర్ (45) అనే వ్యక్తి, సురేశ్ అలియాస్ బాలాజీ అనే వ్యక్తితో కలిసి బుజ్ వర్క్స్, బ్యాంక్ బకెట్ అనే ఫేక్ లోన్ కన్సల్టెన్సీ సంస్థను పెట్టాడు. ఐసీఐసీఐ బ్యాంకు అనుబంధ సంస్థ అని వాళ్లు నమ్మించేవారు. సికింద్రాబాద్‌లోని ఆర్పీ రోడ్లో ఆఫీసు పెట్టారు. తాము చేసే నేరం తమ మీద పడకూడదన్న ఉద్దేశంతో టెంపరరీ ఉద్యోగులను నియమించకున్నారు. వారి నంబర్లతోనే కస్టమర్లకు ఫోన్లు చేయించేవారు. అందుకు తగ్గట్టు గత ఏడాది డిసెంబర్1న 12 మంది టెలికాలర్లను పెట్టుకున్నారు. వారితో కస్టమర్లకు ఫోన్లు చేయించారు. కస్టమర్లు ఓకే అన్నాక, రెండో సెట్లో భాగంగా డిసెంబర్ రెండో వారంలో వెరిఫికేషన్ టీంను నియమించుకున్నారు. వారిని కస్టమర్ల దగ్గరకు పంపి, వివరాలు సేకరించారు. వారితో పనయ్యాక ట్రైనింగ్ అని బెంగళూరు పంపించి, వాళ్ల నంబర్ల నుంచి ఫోన్లు రాకుండా బ్లాక్ చేయించారు. చివరిగా మూడో వారంలో చెక్ కలెక్షన్ టీంను నియమించుకున్నారు. ఓకే అయిన కస్టమర్ల దగ్గరకు పంపి వారిని బ్లాంక్ చెక్‌లు తీసుకున్నారు. ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడా వాళ్ల ఫోన్ నంబర్లు ఇవ్వకుండా, ఉద్యోగుల ఫోన్ నంబర్లతోనే కాల్ చేయించారు. ఇక, చివరిగా నాలుగో వారంలో విత్‌డ్రా టీంను నియమించారు. కస్టమర్లు ఇచ్చిన చెక్‌లను బ్యాంక్ నుంచి డ్రా చేయించుకున్నారు. రూ.50 లక్షలు నొక్కేశారు.
ఆ ఒక్క తప్పుతో దొరికిపోయారు
కస్టమర్ ఇచ్చిన బ్యాంక్ చెక్కును బ్యాంకులో వేసేందుకు చెక్ విత్‌డ్రా టీంను లోపలికి పంపుతారు. ఆ టైంలో వారికి ఓ మామూలు ఫోన్ ఇస్తారు. చెక్ వెనక చెక్ విత్‌డ్రా టీంలోని మెంబర్ పేరు రాయడంతో పాటు, వాళ్లిచ్చిన మామూలు ఫోన్ నంబర్ రాయాల్సిందిగా చెబుతారు. ఈ ప్రాసెస్నంతా ఫేక్ సంస్థ యజమానులు బయట ఉండి నడిపిస్తారు. డబ్బులు నొక్కేస్తారు. ప్రాసెస్ అయ్యాక ఆ నంబర్‌ను తీసేస్తారు. కానీ, చెక్ విత్‌డ్రా టీంలోని ఓ సభ్యుడు, ఫేక్ కంపెనీ ఇచ్చిన నంబర్‌ను కాకుండా, తన సొంత నంబర్‌ను చెక్‌పై రాయడంతో కంపెనీ బాగోతం బయటపడింది. డబ్బులు కట్ అయినట్టు కస్టమర్‌కు మెసేజ్ రావడం, ఆయన బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయింది. వెంటనే బ్యాంకు అధికారులు చెక్విత్ డ్రా టీం మెంబర్‌కు ఫోన్ చేసి నిలదీయడంతో అసలు విషయం చెప్పాడు. దీంతో బాధితుడు మహంకాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదే విధంగా మోసపోయిన బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌కు చెందిన గట్ల మురళి అనే వ్యాపారి కూడా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు మహేశ్, సికింద్రాబాద్ రేతిఫైల్లోని ఓయో హోటల్లో ఉన్నట్టు తెలుసుకున్నారు. మంగళవారం అక్కడికి వెళ్లారు. పోలీసులను చూసిన మహేశ్, రెండో అంతస్తు నుంచి దూకడంతో కాలుకు దెబ్బ తగిలింది. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రీట్మెంట్ చేయించి గురువారం రిమాండ్‌కు తరలించారు. ఈ నెల రోజుల ప్రాసెస్‌లో మొత్తం డబ్బును గత ఏడాది డిసెంబర్ 30, 31నే డ్రా చేద్దామనుకున్నారు. ఆ రెండ్రోజుల్లోనే రూ.50 లక్షలు విత్ డ్రా చేశారు
