సంగారెడ్డి జిల్లా రామోజి పల్లిలో విషాదం..ఈత సరదాకు ముగ్గురు బలి

 సంగారెడ్డి జిల్లా  రామోజి పల్లిలో విషాదం..ఈత సరదాకు ముగ్గురు బలి
  •     నీటిలో మునిగి చనిపోయిన చిన్నారులు

రాయికోడ్, వెలుగు : సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌‌ మండలం రామోజీపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నిరంజన్‌‌ (12), మున్నూరు బసలింగం (14), మున్నూరు మనోజ్‌‌కుమార్‌‌ (8) ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని నల్లవాగులో తీసిన గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో గుంత లోతుగా ఉండడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. 

సాయంత్రం బయటకు వెళ్లిన పిల్లలు రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు గ్రామమంతా వెదికారు. ఈ క్రమంలో పిల్లలు వాగు వైపు వెళ్లినట్లు గ్రామస్తులు చెప్పడంతో అక్కడికి వెళ్లి చూడగా... గుంత ఒడ్డున పిల్లల దుస్తులు, చెప్పులు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాయికోడ్‌‌ ఎస్సై చైతన్య కిరణ్‌‌ తన సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మత్స్యకారులను పిలిపించి గుంతలో గాలించగా.. ముగ్గురు బాలుర డెడ్‌‌బాడీలు దొరికాయి.