
- తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ముగ్గురు పిల్లలు
- శిథిలావస్థకు చేరి కూలిపోయిన పూరి గుడిసె
- హాస్టళ్లల్లో చదువుకుంటూ..సెలవుల్లో కిరాయి ఇంట్లో ఉంటున్న పరిస్థితి
- ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకుంటే ఎంపిక చేయని ఆఫీసర్లు, కమిటీ
- ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండల కేంద్రానికి చెందిన అక్కాచెల్లెళ్ల దుస్థితి ఇది
కాగజ్ నగర్, వెలుగు: తల్లిదండ్రులు అనార్యోగంతో చనిపోయారు. పిల్లలు ముగ్గురు అనాథలుగా మిగిలారు. నిరు పేద కుటుంబం కాగా.. తండ్రి ఉన్నప్పుడు వేసిన గుడిసెలోనే ఉంటుండగా.. అది కూడా శిథిలావస్థకు చేరి ఏడాది కింద కూలిపోయింది. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ టీ మండల కేంద్రానికి చెందిన అక్కాచెల్లెళ్లు, తమ్ముడైన మహీన్ నిదా, నూరి సబా, మహమ్మద్ ముస్తఫా దుస్థితి ఇది. పదేండ్ల కింద వీరి తల్లి ఆసియా బేగం కిడ్నీ వ్యాధితో చనిపోగా.. ఆటో డ్రైవరైన తండ్రి యూసఫ్ పిల్లలను సాకుతూ వచ్చాడు.
రెండేండ్ల కింద ఆయన కూడా అనారోగ్యంతో మరణించాడు. దీంతో ముగ్గురు పిల్లలు దిక్కులేనివారు అయ్యారు. బంధువుల సాయంతో ముగ్గురూ ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారు. పెద్దమ్మాయి మహిన్ ఇంటర్ కంప్లీట్ చేయగా, రెండో అమ్మాయి నూరి సబా ఇటీవల టెన్త్ పాస్ అయింది. వీరు తమ్ముడు ముస్తఫా మంచిర్యాలలో చదువుతున్నాడు.
సమ్మర్ సెలవులు కావడంతో ఇంటి వచ్చారు. వారు ఉండేందుకు గుడిసె కూడా లేకపోవడంతో పక్కన ఇంట్లో రూ.1200 ఇచ్చి అద్దెకు ఉంటున్నారు. ముగ్గురూ చదువుకుంటుండగా.. సెలవుల్లో పూట గడవడం కూడా కష్టంగా మారింది. వీరు ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకోగా.. అధికారులు, ఇందిరమ్మ కమిటీ ఎంపిక చేయలేదు. తొలి విడత జాబితాలో వీరికి ఇల్లు కేటాయించలేదు.
ఇంటి అద్దె కట్టే ఆర్థికస్థోమత కూడా లేదని, అనాథలమైన తమపై దయ చూపి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అక్కా చెల్లెళ్లు కోరుతున్నారు. వీరిని ఇందిరమ్మ ఇంటికి ఎంపిక చేయకపోవడంపై స్థానికంగా సోషల్ మీడియాలోనూ అధికారుల తీరును తప్పుబడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూల్స్ పక్కన బెట్టి వెంటనే వీరికి ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్థానిక సిర్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ శేని తిరుపతిని వివరణ కోరగా.. తొలి విడత జాబితాలో పేరు ప్రతిపాదించకపోవడంతో మంజూరు చేయలేదని, రెండో జాబితాలో ఉందని తెలిపారు.