ఖమ్మంలో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్​లోకి మాజీ ఎమ్మెల్సీ బాలసాని

ఖమ్మంలో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్​లోకి మాజీ ఎమ్మెల్సీ బాలసాని
  • తుమ్మల, పొంగులేటి ఆధ్వర్యంలో సీక్రెట్ ఆపరేషన్​ 
  • అలర్టయిన మంత్రి అజయ్  
  • ముఖ్యనేతలు, కార్పొరేటర్లతో మీటింగ్​

ఖమ్మం, వెలుగు:  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్​కు షాక్​ తగిలింది. ఒక్కసారిగా ఒక మాజీ ఎమ్మెల్సీ, ముగ్గురు కార్పొరేటర్లు, ఇద్దరు మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరడం సంచలనంగా మారింది. ఒక్క రోజు ముందు కూడా మంత్రి అజయ్​పర్యటనలో​ వెంట తిరిగిన వారు కూడా పార్టీ మారిన వారిలో ఉన్నారు. ముందుగా ఆదివారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఆ తర్వాత ఒక్కొక్క కార్పొరేటర్​ ఇంటికి వెళ్లి కాంగ్రెస్​లోకి ఆహ్వానించారు.

దీంతో జంపింగ్స్​ జాబితాలో ఇంకెవరున్నారన్న చర్చ మొదలైంది. మొత్తం15 మందికి పైగా కార్పొరేటర్లు తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్​ లీడర్లు చెబుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్​ మేనిఫెస్టో విడుదల, బీఫామ్​ల పంపిణీ సందర్భంగా హైదరాబాద్ వెళ్లిన మంత్రి పువ్వాడ అజయ్​  చేరికల విషయం తెలియడంతో హుటాహుటిన ఖమ్మం చేరుకున్నారు. మమత కాలేజీలో ముఖ్య నేతలు, కార్పొరేటర్లతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇంకెవరూ పార్టీ మారకుండా ఉండేందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. 

బాలసానికి బుజ్జగింపులు విఫలం..!

పార్టీలో అసంతృప్తులను బుజ్జగించేందుకు చివరి నిమిషం వరకు బీఆర్ఎస్​ నేతలు చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీశ్​రావు, పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పలుసార్లు సంప్రదింపులు జరిపారు. ఆదివారం ఉదయం కూడా బాలసానికి కేటీఆర్​ ఫోన్ ​చేసి మాట్లాడారు.

ఈ సందర్భంగా కొద్ది నెలలుగా తనకు పార్టీలో జరుగుతున్న అవమానాలను బాలసాని వారికి వివరించినట్టు తెలిసింది. ఎనిమిది నెలల క్రితం తనకు అప్పగించిన భద్రాచలం ఇన్​చార్జి పదవీ బాధ్యతల నుంచి అకారణంగా తప్పించారని, ఫ్లెక్సీల్లో కూడా ఫొటో పెట్టకుండా, ఏ కార్యక్రమాలకూ పిలవకుండా అవమానించారని చెప్పుకొచ్చారు. తన రాజీనామా లెటర్​ను పార్టీ అధ్యక్షుడికి పంపించారు. తర్వాత కొద్ది సేపటికే పొంగులేటి, తుమ్మల కలిసి బాలసాని ఇంటికి వెళ్లి కాంగ్రెస్​లోకి ఆహ్వానించారు. అక్కడి నుంచి ముగ్గురు లీడర్లు కలిసి బీఆర్ఎస్​ కార్పొరేటర్ కమర్తపు మురళి ఇంటికి వెళ్లారు. ఆయన గతంలో మూడేండ్ల పాటు నగర బీఆర్ఎస్ ​అధ్యక్షుడిగా పని చేశారు.

రెండుసార్లు కార్పొరేటర్​గా గెలిచారు. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్​ పోస్టును ఆశించి భంగ పడ్డారు. మురళి అసంతృప్తితో ఉన్న విషయంపై ఆదివారం ఉదయం కూడా చర్చలు జరిగినట్టు తెలు స్తోంది. మంత్రి కేటీఆర్​తో అజయ్ ​ఫోన్ ​చేయించి మురళితో మాట్లాడించారు. అయినా ఆయన పార్టీ మారేందుకే నిర్ణయించుకున్నారు. మురళిని కాంగ్రెస్​లోకి ఆహ్వానించిన తర్వాత ఆయన్ను వెంట బెట్టుకొని మరో కార్పొరేటర్​ చావా మాధురి ఇంటికి వెళ్లారు.

ఆమె భర్త చావా నారాయణరావు గత పాలకవర్గంలో కార్పొరేటర్​గా పనిచేశారు. వీళ్లిద్దరిని కాంగ్రెస్​లోకి ఆహ్వానించిన తర్వాత మరో కార్పొరేటర్​ రావూరి కరుణ, సైదిబాబు ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. అందరినీ వెంట తీసుకొని పొంగులేటి ఇంటికి చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్​ మాజీ కార్పొరేటర్లు పోట్ల వీరేందర్​, చేతుల నాగేశ్వరరావు కూడా తాము కాంగ్రెస్​ లో చేరుతున్నట్టు ప్రకటించారు. 

ఆట మొదలైందన్న పొంగులేటి, తుమ్మల  

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆట మొదలైందని, కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. ముందు బాలసాని ఇంట్లో..ఆ తర్వాత పొంగులేటి ఇంట్లో నేతలు మీడియాతో మాట్లాడారు. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తాను ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ధర్మం వైపు నిలబడాలని  కోరారు. ఇప్పటి వరకు సౌమ్యం గా ఉన్నామని, ఇక ఓపిక లేదని చెప్పారు.

అధికారులు చిల్లర పనులు మానాలని, అధికార పార్టీకి తొత్తులుగా ఉండొద్దన్నారు. ఉద్యోగం కాకుండా బీఆర్ఎస్​ కార్యకర్తల్లా పనిచేస్తే భవిష్యత్​లో ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.  పొంగులేటి మాట్లాడుతూ ‘అరాచక పాల నకు కేరాఫ్ పువ్వాడ అజయ్. నగరంలో అధికార పార్టీ లీడర్లు చేసిన కబ్జాలన్నీ అధికారంలోకి రాగానే బయటకు తీస్తాం. పేద, మధ్య తరగతి ప్రజలు కొనుక్కున్న ప్రతి గజాన్ని వారికి చెందేలా చేస్తాం’ అని అన్నారు. 

చాలాసార్లు అవమానించారు : బాలసాని లక్ష్మీనారాయణ

బీఆర్ఎస్​లో చాలాసార్లు అవమానించడం వల్లే పార్టీ మారాల్సి వస్తోంది. అధిష్టానానికి చెప్పుకున్నా పట్టించుకోలేదు. ఎనిమిది నెలల క్రితం భద్రాచలం ఇన్​చార్జిగా నియమించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో తిరుగుతూ కష్టపడి పనిచేశా. చెప్పా పెట్టకుండా నన్ను తప్పించి తాతా మధుని ఇన్​చార్జి చేశారు. పార్టీ కోసం పనిచేసిన నన్ను పక్కన పెట్టి మధుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. మరో బీసీ నాయకుడిని జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించి మధుని అధ్యక్షుడిని చేశారు. తాతా మధు సంగతేంటో ఎన్నికల్లో భద్రాచలంలోనే చూపిస్తా. బీసీలకు అవమానం జరిగినందునే రిజైన్​ చేస్తున్నా. ఖమ్మం జిల్లాలో ఎంతమంది బీసీలకు పడవులిచ్చారో చెప్పాలి. కేటీఆర్..పొన్నాలను పార్టీలోకి ఆహ్వానిస్తావు..కానీ.. పార్టీలో ఉన్న బీసీని అవమానిస్తావా?