ఆంధ్రా మెడికల్ కాలేజీకి వందేళ్లు.. గ్రాండ్ సెలబ్రేషన్స్

ఆంధ్రా మెడికల్ కాలేజీకి వందేళ్లు.. గ్రాండ్ సెలబ్రేషన్స్

ఆంధ్రా మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాలు అక్టోబర్ 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు.  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేడుకల కమిటీ చైర్మన్ టి.రవిరాజు మాట్లాడుతూ..  1923 జూలై 19న ఏఎంసీ ప్రారంభమైందని, దేశంలోనే ఏఎంసీ  ఏడో పురాతనమైనదని తెలిపారు. ఇది 1950 లోనే సూపర్ స్పెషాలిటీ సేవలను ప్రవేశపెట్టిందని,  ఇక్కడ చదివిన వారిలో చాలా మంది విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారని వెల్లడించారు, కళాశాలకు చెందిన దాదాపు 3,000 మంది పాత విద్యార్థులు వేడుకలకు హాజరవుతారని ఆయన వెల్లడించారు. దేశంలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే కళాశాలలు చాలా తక్కువగా ఉన్నాయని, వాటిలో ఏఎంసీ కూడా ఒకటని తెలిపారు.  

ఈ మూడు రోజుల వేడుకలను ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. అలాగే ఏఎంసీకి ఆనుకుని ప్రభుత్వం కేటాయించిన 1.6 ఎకరాల స్థలంలో కళాశాల పూర్వ విద్యార్థులు రూ.50 కోట్లతో భవనాన్ని నిర్మించారని ఈ సందర్భంగా ప్రారంభోత్సవం చేయనున్నట్లు రవిరాజు తెలిపారు.   రెండో రోజు కార్యక్రమంలో గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినీ, ఇతర మంత్రులు సమావేశాల్లో పాల్గొంటారు.