
చేవెళ్ల, వెలుగు: కాంగ్రెస్ పాలనలో నాయకులకు మూడు కొట్లాటలు.. ఆరు కేసులు తప్ప అభివృద్ధిపై సోయి ఉండేది కాదని చేవెళ్ల సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య ఆరోపించారు. మంగళవారం చేవెళ్ల సెగ్మెంట్ పరిధి గొల్లపల్లి, ధర్మసాగర్, ఖానాపూర్, రేగడి ఘనపూర్, దేవరంపల్లి, నాంచేరి, కిష్టాపూర్ గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన విఘ్నేశ్ గౌడ్ ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కాలె యాదయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఓటేసి రైతులు 60 ఏండ్లు అరిగోస పడ్డారన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్నాటకలో ప్రస్తుతం కరెంట్ లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.
బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఆయన చెప్పారు. 60 ఏండ్లలో కాంగ్రెస్ చేయని అభివృద్ధిని పదేళ్లలో చేసి చూపించామన్నారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. యాదయ్య వెంట చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మెంబర్ మర్పల్లి మాలతి, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ కార్యకర్తలు పాల్గొన్నారు.