ఏసీబీకి చిక్కిన ముగ్గురు ఇరిగేషన్‌‌‌‌ అధికారులు

ఏసీబీకి చిక్కిన ముగ్గురు ఇరిగేషన్‌‌‌‌ అధికారులు

హైదరాబాద్, వెలుగు :  ముగ్గురు ఇరిగేషన్ అధికారులు ఏసీబీకి చిక్కారు. మణికొండలో ఓ బిల్డింగ్ నిర్మాణానికి ఎన్‌‌‌‌ఓసీ ఇచ్చేందుకు రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్‌‌‌‌ హ్యాండెడ్‌‌‌‌గా పట్టుపడ్డారు. రంగారెడ్డి జిల్లా సర్కిల్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ కె భన్సీలాల్‌‌‌‌, అసిస్టెంట్‌‌‌‌ ఇంజినీర్లు కె కార్తీక్‌‌‌‌, హెచ్‌‌‌‌ నికేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ తో పాటు నాలాపై సర్వే చేసేందుకు రూ.40 వేలు లంచం అడిగిన గండిపేట మండల సర్వేయర్‌‌‌‌ గణేశ్​ను కూడా ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్​ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌‌‌‌కు తరలించారు. మణికొండ నెక్నాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన బొమ్ము ఉపేంద్రనాథ్‌‌‌‌ స్థానికంగా బిల్డింగ్‌‌‌‌ కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌ చేస్తున్నాడు. అతనికి ఎన్‌‌‌‌వోసీ ఇచ్చేందుకు నిఖేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ రూ.2.5 లక్షలు డిమాండ్‌‌‌‌ చేశాడు.

ఇందులో రూ.1.5 లక్షలు అడ్వాన్స్‌‌‌‌గా తీసుకున్నారు. మరో రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారుల వేధింపులతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. హైదరాబాద్‌‌‌‌ సిటీ యూనిట్‌‌‌‌ అధికారులు కేసు నమోదు చేశారు. పక్కా ప్రణాళికతో గురువారం సాయంత్రం నాంపల్లి రెడ్‌‌‌‌ హిల్స్‌‌‌‌లోని నార్త్‌‌‌‌ ట్యాంక్స్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ లో భన్సీలాల్‌‌‌‌, నికేశ్ రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. అనంతరం ఆ ఆఫీస్‌‌‌‌తో పాటు మణికొండ సర్వేయర్ ఆఫీసులో సోదాలు జరిపారు. సుమారు నాలుగు గంటల పాటు సోదాలు కొనసాగాయి.

అనంతరం అసిస్టెంట్ ఇంజినీర్లు కార్తీక్‌‌‌‌, నికేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌లను అదుపులోకి తీసుకున్నారు. ఏఈ భన్సీలాల్ పారిపోవడంతో గాలించి పట్టుకున్నారు. భన్సీలాల్‌‌‌‌తో పాటు గణేశ్ ను అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేశారు. భన్సీలాల్‌‌‌‌ నుంచి రూ.65 వేలు, కార్తీక్‌‌‌‌ నుంచి రూ.35 వేలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వారి ఆస్తుల వివరాలను కూడా ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు.