- మృతుల్లో తల్లీకూతురు, కోడలు
- కామారెడ్డి జిల్లా పిట్లంలో ఘటన
పిట్లం, వెలుగు : మంజీరా నదిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బొల్లక్‌పల్లి శివారులో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే...పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన తుపాకుల పండరి తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మొక్కులు తీర్చుకునేందుకు శుక్రవారం బుడ్మి గ్రామం వద్ద ఉన్న ఎల్లమ్మ ఆలయానికి వచ్చారు.
కొద్ది సేపటి తర్వాత పండరి కూతురు పవనశ్రీ (14), అతడి చెల్లెలు, లింగంపేట మండలం పర్మల్ల గ్రామానికి చెందిన అనిత (35), ఆమె కుమార్తె శివాని (13)తో పాటు పిట్లం మండలం గోద్మెగాం గ్రామానికి చెందిన భానుప్రసాద్ స్నానం చేసేందుకు మంజీరా నదిలోకి దిగారు. ఈ క్రమంలో నీటిలో మునిగి నలుగురు గల్లంతయ్యారు. గమనించిన మిగతా కుటుంబ సభ్యులు, స్థానికులు నీటిలోకి దిగి గాలించి నలుగురిని బయటకు తీశారు. కానీ అప్పటికే అనిత, శివాని, పవనశ్రీ చనిపోగా.. భానుప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్‌కు తరలించారు. స్థానికుల సమాచారంతో పిట్లం ఎస్సై ఆంజనేయులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
