రేట్లను పెంచిన మరో మూడు బ్యాంకులు

రేట్లను పెంచిన మరో మూడు బ్యాంకులు

రెపోరేటు పెంపే కారణం

న్యూఢిల్లీ: ధరల భారాన్ని తగ్గించేందుకు ఆర్‌‌‌‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) తన తాజా పాలసీ సమీక్షలో రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) పెంచడంతో బ్యాంకులూ వడ్డీరేట్లను పెంచుతున్నాయి. దీంతో రిటైల్​, హోంలోన్లపై మరింత ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. హెచ్​డీఎఫ్​సీ, ఐసిఐసిఐ బ్యాంక్, పిఎన్‌‌బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకులు తమ లోన్​ రేట్లను పెంచాయి. రెపో రేటు ప్రకారం డిపాజిట్లు,  లోన్లపై ఇవి వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. రిటైల్ లోన్లపై ఇప్పుడు 7.95 శాతం వడ్డీ రేటు ఉంటుందని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. ఇది రెపో రేటు కంటే 2.55 శాతం ఎక్కువ. ఈ బ్యాంకు  రిటైల్ లోన్లు రెపో రేటు ప్రకారమే ఉంటాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్‌‌టర్నల్ బెంచ్‌‌మార్క్ లెండింగ్ రేటు (ఐఈబీఎల్​ఆర్​) కూడా రెపో రేటుకు లింక్​ అయి ఉంటుంది. దీనిని 9.10 శాతానికి పెంచినట్టు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది.  కెనరా బ్యాంక్ తన రెపో రేట్-లింక్డ్ లెండింగ్ రేటును 50 బేసిస్​ పాయింట్లు పెంచడంతో వడ్డీరేటు 8.30 శాతానికి పెరిగింది. కొత్త రేట్లు ఆగస్టు 7 నుండి అమలులోకి వచ్చాయి.  

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్  లోన్​ రేట్లు (ఏడాది–మూడేళ్లు)  7.40 శాతం నుంచి  7.80 శాతం మధ్య ఉంటాయి. మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు గల లోన్ల రేట్లు  8.00–-8.40 శాతం వరకు ఉంటాయి. ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల లోపు వాటిపై 8.40–-8.80 శాతం వడ్డీ కట్టాలి. పది సంవత్సరాల నుండి 15 సంవత్సరాల కంటే తక్కువ గల లోన్​ రేట్లు 8.90–-9.30 శాతం మధ్య ఉంటాయి. ఎంపీసీ తన పాలసీ రివ్యూలో శుక్రవారం (ఆగస్టు 5) రెపో రేటును 50 బేసిస్​ పాయింట్ల పెంచి 5.4 శాతానికి చేర్చింది. ఇది వరుసగా మూడవసారి పెరిగింది.    తనఖా అప్పులు ఇచ్చే హెచ్​డీఎఫ్​సీ కూడా  వడ్డీరేట్లను మరోసారి పెంచింది. ఈసారి వీటిని 25 బేసిస్​ పాయింట్ల మేర పెంచుతున్నట్టు ప్రకటించింది. ఫలితంగా కొత్త, పాత కస్టమర్లు హోం లోన్ల కిస్తీల భారం పెరుగుతుంది.