తొలి రోజు మూడు నామినేషన్లు దాఖలు

తొలి రోజు మూడు నామినేషన్లు దాఖలు

హుజూరాబాద్​ వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం మొదలైంది. మొదటి రోజు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్​ఎస్​ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​ రెండు సెట్ల నామినేషన్లు వేయగా మరో నామినేషన్​ను అన్నా వైఎస్​ఆర్​ పార్టీ అభ్యర్థి ఎండీ మన్సూర్​ వేశారు. గెల్లు శ్రీనివాస్​ వెంట మంత్రి గంగుల కమలాకర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్, మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మాజీ మంత్రి  ఇనుగాల పెద్దిరెడ్డి ఉన్నారు. నామినేషన్ వేసిన తర్వాత గెల్లు, వినోద్​​ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌‌ఎస్​కు ఈటల రాజేందర్​ వెన్నుపోటు పొడిచారని వినోద్ విమర్శించారు. వెన్నుపోటుదారులకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. రైతు వ్యతిరేక పార్టీ బీజేపీలో ఈటల చేరారని, ఆ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు​పరం చేస్తోందని విమర్శించారు. గెల్లు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తనను నమ్మి హుజూరాబాద్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్నో కేసులను ఎదుర్కొన్నానని, జైలుకు వెళ్లొచ్చానని అన్నారు. కులమతాలకు అతీతంగా తనను గెలిపిస్తే హుజూరాబాద్‌‌ను ​అభివృద్ధి చేస్తానని తెలిపారు. 

టీఆర్‌‌ఎస్‌‌ స్టార్‌‌ క్యాంపెయినర్లు వీళ్లే

హుజూరాబాద్‌‌ ఉప ఎన్నికలో పార్టీ తరఫున ప్రచారం చేసే స్టార్‌‌ క్యాంపెయినర్ల జాబితాను టీఆర్‌‌ఎస్‌‌ నేతలు శుక్రవారం సీఈవోకు అందజేశారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌‌, వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌, మంత్రి కేటీఆర్‌‌, మంత్రులు హరీశ్‌‌రావు, గంగుల కమలాకర్‌‌, కొప్పుల ఈశ్వర్‌‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌‌ రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌‌రావు, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌‌, బాల్క సుమన్‌‌, చల్ల ధర్మారెడ్డి, వొడితెల సతీశ్‌‌కుమార్‌‌, గువ్వల బాలరాజు, ఆరూరి రమేశ్‌‌, నన్నపునేని నరేందర్‌‌, పెద్ది సుదర్శన్‌‌ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, దాసరి మనోహర్‌‌ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, జెడ్పీ చైర్‌‌ పర్సన్‌‌ కనమల్ల విజయను స్టార్‌‌ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు.