నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నిధులు దుర్వినియోగం చేసిన ముగ్గురు పంచాయతీ సెక్రటరీలను సస్పెండ్ చేస్తూ నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శి పి కిషన్ ఈ గ్రామ స్వరాజ్ ఆన్లైన్ లో బిల్లులు, ఓచర్లు, బుక్కు కాపీలకు బదులుగా రఫ్ పేపర్లు, వైట్ పేపర్లు, బ్యాంక్ పాస్ బుక్ అప్లోడ్ చేశాడు. రూ.1,94,501 దుర్వినియోగం చేశాడని తేలింది.
కొల్లాపూర్ మండలం సింగోటం పంచాయతీ కార్యదర్శి పి అర్జునయ్య ఈ గ్రామ స్వరాజ్ ఆన్లైన్ లో చిత్తు కాగితాలను అప్లోడ్ చేశాడు. రూ.12.97 లక్షలు దుర్వినియోగం చేశాడని తేలింది. ఇదే మండలం అంకిరావ్ పల్లి పంచాయతీ కార్యదర్శి ఆర్ ప్రేమ్చంద్ వెబ్ సైట్ లో పనులకు సంబంధించిన బిల్లులు కాకుండా ఇతర పేపర్లను అప్లోడ్ చేయడంతో పాటు రూ.1,93, 915 దుర్వినియోగం చేసినట్లు తేలింది. ముగ్గురు విలేజ్ సెక్రటరీలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కలెక్టర్ తెలిపారు.

