ఒకే రోజు ఒకే ఇంట్లో ముగ్గురు మృతి

ఒకే రోజు ఒకే ఇంట్లో ముగ్గురు మృతి
  • కొడుకు ఫస్ట్​ బర్త్​డేకు రానన్న భర్త 
  • మనస్తాపంతో కొడుక్కు విషమిచ్చి సూసైడ్​ చేసుకున్న భార్య
  •  బిడ్డ, మనుమడు మృతితో కలత చెంది విషం తాగి అమ్మమ్మ మృతి
  •  కరీంనగర్​ రూరల్​ మండలం బొమ్మకల్​లో విషాదం

కరీంనగర్ క్రైం, వెలుగు: కుటుంబ కలహాలతో ఓ తల్లి ఏడాది వయసున్న కొడుక్కు విషమిచ్చి, తానూ ఆత్మహత్య చేసుకున్నది. కొడుకు మొదటి బర్త్​డేకు భర్త రానని అన్నందుకు మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది. కూతురు, మనుమడి మృతితో కలత చెందిన బాలుడి అమ్మమ్మ కూడా విషం తాగి తనువు చాలించింది. ఒకే ఇంట్లో ముగ్గురి మృతితో కరీంనగర్​ రూరల్​ మండలం బొమ్మకల్​లో విషాదం నెలకొన్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  

కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ విజయ నగర్ కాలనీలో నివాసముంటున్న గద్దె వెంకటేశ్వర్– జయప్రద దంపతులకు ఇద్దరు కూతుళ్లు. రెండో కూతురు  శ్రీజ (32)కు వరంగల్​కు చెందిన మొగ్దుంపురం నరేశ్​తో మూడేండ్ల క్రితం  వివాహమైంది.‌‌‌‌ నరేశ్​ సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. వారికి 11 నెలల 25 రోజుల వయసున్న కొడుకు రేయన్ష అలియాస్ ఆర్విన్ ఉన్నాడు. అత్తింట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని నాలుగు  రోజుల క్రితం శ్రీజను ఆమె తల్లిదండ్రులు  ఇంటికి తీసుకువచ్చారు.
 
మంగళవారం ఉదయం నరేశ్​తో శ్రీజ  ఫోన్​లో మాట్లాడింది. బాబు పుట్టిన రోజు విషయంపై చర్చించారు. పుట్టిన రోజుకు తాము రామని నరేశ్‌‌‌‌ చెప్పడంతో శ్రీజ మనోవేదనకు గురైంది. ఇంట్లో ఉన్న విషగుళికలను బాలుడికి తాగించింది. అనంతరం తను కూడా మింగింది. స్పృహ తప్పిపడిపోయిన ఇద్దరిని కుటుంబ సభ్యు లు వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాబు చనిపోగా, శ్రీజను మెరుగైన చికిత్స కోసం అపోలో దవాఖానకు తీసుకెళ్లారు. కాగా, అక్కడ ట్రీట్​మెంట్​ పొందుతూ శ్రీజ కన్నుమూసింది.