రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ముగ్గురి హత్య

రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ముగ్గురి హత్య
  • మరో ఇద్దరి ఆత్మహత్య 
  • ఆత్మకూరులో అనుమానంతో భార్యను చంపిన భర్త
  • తర్వాత పురుగుల మందు 
  • తాగి సూసైడ్​
  • కుమ్రంభీమ్​ జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య  
  • యాదాద్రి జిల్లాలో మరొకరితో కలిసి కూతురును కడతేర్చిన తల్లి
  • ఆసిఫాబాద్​ జిల్లాలో తాగుబోతు భర్తతో వేగలేక భార్య బలవన్మరణం
  • కాపాడబోయిన భర్త కూడా మృతి

మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చే స్థితి నుంచి ఒకరి ప్రాణాలను మరొకరు తీసే స్థాయికి చేరుకుంటున్నారు. కుటుంబంలో జరిగే చిన్న చిన్న గొడవలు, క్షణికావేశాలు, అనుమానాలు, వివాహేతర సంబంధాలు వీటికి కారణాలవుతున్నాయి. రాష్ట్రంలో మంగళవారం నాలుగు చోట్ల జరిగిన ఇలాంటి ఘటనలు తరిగిపోతున్న మానవీయ విలువలకు అద్దం పడుతున్నాయి.  కూర్చొని మాట్లాడుకుంటే సమసిపోయే సమస్యలను చావు దాకా తీసుకువెళ్లి తమ జీవితాలను, ఆధారపడ్డ వారిని ఆగం చేస్తున్నారు.  

పెళ్లయిన నలభై రోజులకే భార్య హత్య 
ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన తాళ్ల హరీశ్ (26) తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేటకు చెందిన పుష్పలీల (19) ను జూన్ 17న పెండ్లి చేసుకున్నాడు. తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్నాడు. పెండ్లయిన 20 రోజులకే హరీశ్​ ఆత్మహత్యాయత్నం చేశాడు. దవాఖానా నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అనుమానం మరింత పెరిగింది. దీంతో వేధించడం మొదలుపెట్టాడు. సోమవారం సాయంత్రం భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆవేశానికి లోనై పుష్పలీలను గొడ్డలితో నరికి చంపాడు. తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ గణేశ్​కేసు నమోదు చేశారు.  

భర్త గొంతు పిసికి బొంద పెట్టింది

కాగజ్ నగర్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం ​నుంచి అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వచ్చారా దంపతులు. అయితే భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇద్దరిని ప్రత్యక్షంగా చూసిన భర్త ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించాడు. దీంతో ప్రియుడు కర్రతో తలపై కొట్టాడు. వారించాల్సిన భార్య రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న భర్త  గొంతు పిసికి చంపేసింది. తర్వాత ప్రియుడితో కలిసి బొంద పెట్టింది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లా సిర్పూర్ (టి) మండలం ఇటుకల పహాడ్​లో అటవీ శాఖ ప్లాంటేషన్ లో కూలి పనుల కోసం మధ్యప్రదేశ్​ రాష్టంరం నుంచి మడవి దేవేందర్ (40) ఇతడి భార్య పార్వతి (33) మరో కూలి రామ్ లాల్ వచ్చారు. ప్లాంటేషన్ పనులు చేసే దగ్గరే గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున రాంలాల్ తో కలిసి ఏకాంతంగా ఉండడాన్ని దేవేందర్ చూసి ప్రశ్నించాడు. దీంతో దేవేందర్ ను రామ్​లాల్​కట్టెతో కొట్టగా పడిపోయాడు. కాపాడాల్సిన భార్య ప్రియుడితో కలిసి అతడి గొంతు పిసికి చంపేసింది. పక్కనే ఉన్న మరో వ్యక్తి సాయంతో డెడ్​బాడీని మోసుకుని దగ్గర్లో తవ్విన కందకంలో పూడ్చి పెట్టారు. దేవేందర్​కనిపించకపోవడంతో బీట్​ఆఫీసర్ ​నరేశ్​ సోమవారం పోలీసులకు కంప్లయింట్ ​ఇచ్చాడు. కాగా, రామ్​లాల్​ ఫుల్లుగా తాగి తన పక్కన ఉన్నవారికి విషయం చెప్పడంతో బయటకు పొక్కింది. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కౌటాల సీఐ స్వామి, సిర్పూర్ టి ఎస్ఐ రవికుమార్, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

కూతురిపై కనికరం చూపలే.. 
నెల్లికుదురు(కేసముద్రం) : కూతురు అనారోగ్యంగా ఉండడంతో అనవసరంగా వైద్యానికి డబ్బులు పెట్టాల్సి వస్తుందని, భవిష్యత్​లో ఖర్చు పెట్టడం ఎందుకు అనుకున్న ఆ తల్లి సహజీవనం చేస్తున్న వ్యక్తితో కలిసి బిడ్డను చంపేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ శివారు నర్సింలగూడెం గ్రామానికి చెందిన శిరీషకు అనూశ్రీ(6)  అనే కూతురు ఉంది. పాప పుట్టిన తర్వాత భర్త నుంచి విడిపోయింది. అన్న వరుసయ్యే కుమారస్వామితో  వివాహేతర సంబంధం పెట్టుకొని, అతడితో కలిసి యాదాద్రి సమీపంలోని మర్రిగూడెం కోళ్లఫారం లో పని చేసుకుంటూ బతుకుతోంది. వీరికి ఇద్దరు కొడుకులు  కూడా పుట్టారు. వారం కింద అనూశ్రీ అనారోగ్యం బారిన పడింది. అమ్మాయికి ట్రీట్​మెంట్​ కోసం  డబ్బులు పెట్టడం అనవసరమని భావించారు. శిరీష చిన్నారి పైన కూర్చొని కదలకుండా పట్టుకోగా కుమారస్వామి గొంతు నులిమి చంపాడు. తర్వాత సొంత గ్రామమైన పెనుగొండ శివారు నర్సింలగూడానికి తీసుకొచ్చి ఖననం చేయడానికి ప్రయత్నించారు. గ్రామస్తులు అనుమానంతో 100కు డయల్ చేసి చెప్పారు. దీంతో పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా హాస్పిటల్ తరలించారు.  అందులో వచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ లో గొంతు  నులిమి హత్య చేసినట్టు తేలింది.  దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. తామే హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో  కేసు నమోదు చేశారు.  

కుంటలో దూకిన భార్య..కాపాడబోయి భర్త మృతి
కాగజ్​నగర్: తాగుబోతు భర్తతో గొడవై కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం గూడెంలో మంగళవారం ఓ భార్య నీటి కుంటలో దూకగా, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన భర్త కూడా ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన పాలె సంతోష్ (35) మంగ (30)లకు పన్నెండేండ్ల కింద పెండ్లయ్యింది. వీరికి చరణ్ (8), శరణ్య (6) పిల్లలు ఉన్నారు. కొన్నేండ్లుగా సంతోష్​ తాగుడుకు బానిసయ్యాడు. దీంతో కుటుంబంలో గొడవలు పెరిగాయి. మంగళవారం ఉదయం కూడా భార్యభర్తల మధ్య లొల్లయ్యింది. మనస్తాపానికి గురైన మంగ  గ్రామ సమీపంలోని  నీటి కుంట వద్దకు కూతురు శరణ్యను తీసుకువెళ్లింది. ఒడ్డున నిల్చోమని చెప్పి నీళ్లలోకి దూకింది. వెంబడించి వచ్చిన భర్త సంతోష్ భార్యను రక్షించేందుకు నీళ్లలో దూకాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో మునిగి చనిపోయారు. పిల్లలు అనాథలయ్యారు.