అరుదైన వ్యాధితో నడవలేని స్థితిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు

అరుదైన వ్యాధితో నడవలేని స్థితిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు

మేడిపల్లి, వెలుగు: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వారిది.. ఐదుగురు ఆడపిల్లల సంతానం. ‘పేద రోగమే’ పెద్దదనుకుంటే.. దానికితోడు ముగ్గురు బిడ్డలను అరుదైన వ్యాధి అంటుకున్నది. చేతులు, కాళ్లు పడిపోయి నడవలేని పరిస్థితి. ఏ చిన్న పనీ చేసుకోలేని దుస్థితి. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా జబ్బు నయం కాలేదు. ఆటో నడిపితే వచ్చే కాసిన్ని డబ్బులు.. అటు కుటుంబ పోషణకు, ఇటు చికిత్సకు సరిపోక ఆ తండ్రి దిక్కుతోచని స్థితిలో కన్నీళ్లు పెట్టుకుంటున్నడు. దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నడు.

వెంటాడిన దురదృష్టం.. ఒకరి తర్వాత ఒకరికి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం నందరం గ్రామానికి చెందిన వెంకటయ్య, శకుంతల దంపతులు.. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని చెన్నారెడ్డి నగర్‌‌లో ఉంటున్నారు. వీరికి ఐదుగురు ఆడపిల్లలు. వెంకటయ్య ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పెద్ద కుమార్తెకు పెండ్లి చేశాడు. రెండో బిడ్డ హేమలత (30)కు పెండ్లి జరిగిన కొన్నాళ్లకు ‘మస్కులర్ డిస్ట్రోఫీ’ అనే అరుదైన జెనెటిక్ డిసీజ్ ఆమెకు సోకింది. దీని వల్ల కండరాలు బలహీన పడి, చేతులు, కాళ్లు పడిపోయి నడవలేని స్థితిలోకి హేమలత చేరుకుంది. దీంతో పదేండ్ల కిందట భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి పుట్టినింట్లోనే ఉంటున్నది. ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. జబ్బు నయం కాకపోగా.. తన మూడో కూతురు స్వర్ణ లత(28) కు సోకింది. ఆమె కూడా కాళ్లు, చేతులు పడిపోయి నడవలేని స్థితికి చేరుకుంది. ఇద్దరు బిడ్డలు జబ్బు పడటం వల్ల.. ఆటో నడపడం ద్వారా వచ్చిన డబ్బులతో కుటుంబ పోషణ, పిల్లల చికిత్సకు వెంకటయ్య ఇబ్బందులు పడ్డాడు. ఇంట్లోనే ఒక చిన్న కిరాణా షాపు పెట్టుకున్నాడు. నాలుగో బిడ్డ ఓ బట్టల షాపులో ఉద్యోగం చేస్తూ.. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచింది. కానీ దురదృష్టం వెంటాడింది. ఐదో కుమార్తె మనీషాను(23) కూడా ఈ వ్యాధి వదల్లేదు. ముగ్గురు కూతుళ్లు నడవలేని, ఏ పనీ చేసుకోని స్థితిలో ఉండటంతో తల్లిదండులు వారి సేవలకే పరిమితం కావాల్సి వస్తున్నది. తల్లిదండ్రులు ఉంటే తప్పా వారి దిన చర్యలు సాగని పరిస్థితి. దీంతో దాతలు సాయం చేసి తన బిడ్డలను ఆదుకోవాలని వెంకటయ్య (ఫోన్– 9908317148) కోరుతున్నాడు.

స్పందించిన కేటీఆర్

ఈ కుటుంబం పడుతున్న అవస్థలను రెండు రోజుల కిందట స్థానికులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. మంత్రి కేటీఆర్‌‌ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన స్పందించారు. బాధితులకు సాయం చేయాలని పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డిని ఆదేశించారు. ఆదివారం ఉదయం వెంకటయ్య కుటుంబాన్ని పరామర్శించిన వెంకట్‌రెడ్డి.. రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేశారు. తమ కార్పొరేషన్‌లోని సెట్విన్ వారితో మాట్లాడి.. వ్యాధికి గురైన అమ్మాయిలకు తగిన రంగంలో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. వెంకటయ్య నాలుగో కూతురికి మున్సిపల్ కార్పొరేషన్‌లో తగిన ఉద్యోగం ఇస్తామని, వారికి నెలకు సరిపోయే సరుకులు ప్రతినెల అందిస్తామని హామీ ఇచ్చారు. ఒకరికి వికలాంగుల పెన్షన్ అందుతున్నదని, మిగతా ఇద్దరికీ అందేలా చూస్తామని తెలిపారు. కుటుంబానికి ప్రతి సంక్షేమ పథకం అందేలా కృషి చేస్తామన్నారు.

సరైన చికిత్స అందిస్తే నయమైతది

‘‘ఒకసారి పేషెంట్లకు స్కానింగ్ చేయించి.. వ్యాధికి గల కారణాలు తెలుసుకోవాలి. తర్వాత అందుకు తగినట్లుగా చికిత్స అందేలా కృషి చేస్తాం. జన్యుపరమైన కారణాల వల్ల ఈ వ్యాధి సోకిందా? లేక పౌష్టికాహార లోపం ఏమైనా ఉందా? అనేది వైద్య పరీక్షల తర్వాత తెలుస్తుంది. ఇది అరుదైన వ్యాధి. లక్ష మందిలో ఒకరిద్దరికి మాత్రమే వస్తుంది. ఇలా కుటుంబంలో ఒకేసారి ముగ్గురికి సోకడం ఇప్పటివరకు జరగలేదు. తెలంగాణ హెల్త్ డిపార్ట్‌మెంట్‌తో కూడా చర్చిస్తా. సరైన చికిత్స అందిస్తే జబ్బు నయమైతది.
- డాక్టర్‌ బి.విజయలక్ష్మి, డైరెక్టర్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనిటిక్స్‌ అండ్‌ హాస్పిటల్‌ ఫర్‌ జెనెటిక్‌ డిసీజెస్‌, హైదరాబాద్‌

శిక్షణ ఇచ్చి ఉపాధి చూపిస్తం

వ్యాధికి గురైన అమ్మాయిలకు ఏ రంగంపై ఆసక్తి ఉందో తెలుసుకుంటాం. ఆ రంగంలో వారికి వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి.. ఉపాధి చూపిస్తాం. అధైర్య పడకుండా జీవితంలో ముందుకు వెళ్లడానికి వారికి మానసిక శిక్షణ కూడా చాలా అవసరం. - వనజ, సెట్విన్ ఇన్‌చార్జి