
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ముగ్గురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిటీలోని ఠాకూర్‌పూర్ కేన్సర్ హాస్పిటల్‌లో ఓ పేషెంట్ బంధువుల్లా చెబుతూ, దగ్గరలోని ఓ ఇంట్లో ఉంటున్న నజౌర్ రెహ్మాన్, షబ్బీర్, రెజౌల్‌ల తీరు అనుమానాస్పదంగా ఉండడంతో కోల్‌కతా పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం రైడ్ చేసి వారిని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు నిషేధిత జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) గ్రూప్‌కు చెందిన టెర్రరిస్టులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలకు ఒక ఇంటిపై రైడ్ చేసి ముగ్గురు బంగ్లాదేశీలను అరెస్ట్ చేశామని, వాళ్ల దగ్గర జేఎంబీకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు దొరికాయని పోలీసులు తెలిపారు. వారి నుంచి ఫోన్లు, తుపాకులు, ఇండియన్ ఐడీ కార్డులు, బంగ్లాదేశీ పోస్‌పోర్టులు, జేఎంబీ డాక్యుమెంట్లు, జీహాదీ సిద్ధాంతాలకు సంబంధించిన పుస్తకాలను సీజ్ చేశామన్నారు. అలాగే ఆ ఇంట్లో దొరికిన ఒక డైరీలో జేఎంబీకి చెందిన బంగ్లాదేశ్ టెర్రరిస్టులు, వాళ్ల లీడర్ల సమాచారం కూడా ఉందని వివరించారు. అరెస్టు చేసిన ముగ్గురు సోషల్ మీడియాలో చేసిన పోస్టుపైనా ఇన్వెస్టిగేషన్ చేస్తామని పోలీసులు తెలిపారు. వీళ్లు ముగ్గురు రెగ్యులర్‌గా బంగ్లాదేశ్‌లోని జేఎంబీ టెర్రరిస్ట్ లీడర్లతో టచ్‌లో ఉంటున్నారని ప్రాథమికంగా తేలినట్లు చెప్పారు. అయితే వాళ్లు ఇక్కడ ఏదైనా టెర్రర్ అటాక్‌కు ప్లాన్ చేస్తున్నారా? అన్నది ఇన్వెస్టిగేషన్‌లో తేల్చాల్సి ఉందని అన్నారు.