వేములవాడ రాజన్న ఆలయంలో మూడు కోడెలు మృతి

వేములవాడ రాజన్న ఆలయంలో మూడు కోడెలు మృతి

దక్షిణకాశిగా పేరొందిన వేములవాడ పుణ్యక్షేత్రంలో కోడె మొక్కులు ఎంత ప్రాధన్యత ఉంటుందో అందరికీ తెలిసిందే.  ఈ ఆలయంలో కోడెలను రాజన్నకు సమర్పిస్తే కోరుకున్నవి జరుగుతాయని భక్తుల నమ్మకం. అయితే ఈ ఆలయానికి చెందిన మూడు కోడెలు  తిప్పపూర్ గోశాలలో మృతి చెందాయి.  సంరక్షణపై  అధికారుల నిర్లక్ష్యంతోనే కోడెలు మృతి చెందాయని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  గతంలోనూ కోడెలు మృతి చెందినప్పటికీ ఆలయ అధికారుల తీరులో ఎలాంటి మార్పు రాలేదని మండిపడుతున్నారు.  అధికారులు తీరు -- భక్తుల మనోభవాలు దెబ్బతీస్తున్నాయని ఫైర్ అవుతున్నారు. 

 కోడె మొక్కుల ద్వారా ఏటా కోట్లల్లో ఆదాయం వస్తున్నా, అధికారులు మాత్రం వాటి ఆలనాపాలనా సరిగా చూసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వాటికి కనీసం పచ్చిగడ్డి కూడా పెడ్తలేరనే ఆరోపణలు ఉన్నాయి. రాజన్న ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. నిజ కోడె మొక్కుల రూపంలో ఏటా దాదాపు 2 వేల వరకు కోడెలు ఆలయానికి వస్తుంటాయి. వీటిలో 300 కోడెలను దేవస్థానంలో ఉంచి, మిగిలిన వాటిని  తెలంగాణ గోశాల ఫెడరేషన్ ద్వారా వివిధ జిల్లాల్లోని గోశాలలకు తరలిస్తుంటారు.  

ప్రస్తుతం దేవస్థానం వద్ద 300 కోడెలు, 80 ఆవులు ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. వీటి సంరక్షణ కోసం రెండు గోశాలలు నిర్వహిస్తున్నారు. ఆలయ సమీపంలోని గోశాలలో 100 వరకు, బస్టాండ్ ఏరియాలోని తిప్పాపూర్​గోశాలలో 200 వరకు కోడెలు, ఆవులను ఉంచుతున్నారు.