
- ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో మూడు గ్రామాలు
- హంగర్గ గ్రామస్తులను సురక్షిత ప్రాంతానికి తరలించిన తహసీల్దార్
- బిక్కుబిక్కుమంటున్న లోతట్టు ప్రాంత ప్రజలు
బాల్కొండ/బోధన్/ నవీపేట, వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్‌తో నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని మూడు గ్రామాలు జలదిగ్భందం అయ్యాయి. హంగర్గ విలేజ్‌లోని హనుమాన్ టెంపుల్, పంచాయతీ ఆఫీస్, స్కూల్ దాకా నీళ్లు రావడంతో రెవెన్యూ ఆఫీసర్లు ఆప్రమత్తమయ్యారు. తహసీల్దార్ విఠల్ ఆర్టీసీ అధికారులతో మాట్లాడి నాలుగు బస్సులను అక్కడికి పంపారు.
1,165 మంది జనాభా ఉండగా, వరద ముంపు ఎక్కువగా ఉన్న ఇండ్లలో ఉన్న 300 మందిని బస్సుల్లో సమీప గ్రామాల్లోని వారి బంధువుల వద్దకు చేర్చారు. మందర్నా గ్రామానికి చేరువగా వరద నీరు వస్తుండడంతో క్యాంప్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. నవీపేట మండలం మిట్టాపూర్, అల్జాపూర్ గ్రామాల చుట్టూ బ్యాక్ వాటర్ చేరి రాకపోకలు నిలిచిపోయాయి.
ఆ రెండు గ్రామాల్లో పరిస్థితిని ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. యంచ, కోస్లీ, బినోల, నందిగావ్లో వరి పంటలు మునిగిపోయాయి. యంచ వద్ద బ్రిడ్జిని తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. ఎస్సారెస్పీ దిగువన ఉన్న కోడిచర్ల, చాకిర్యాల్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిస్థితిని సమీక్షిస్తూ ఆఫీసర్లను అలర్ట్ చేస్తున్నారు.
ఎస్సారెస్పీకి భారీ ఇన్ ఫ్లో..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు శనివారం రాత్రి 12 గంటలకు 2.59 లక్షల క్యూసెక్కులుగా ఉన్న వరద ఆ తరువాత 3.15లక్షల క్యూసెక్కులకు చేరింది. ఇరిగేషన్ ఆఫీసర్లు 39 గేట్లు ఎత్తి 2.75 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ఆ తరువాత ఇన్‌ఫ్లో పెరగడంతో 4.50 లక్షల క్యూసెక్కులకు పెంచారు. 5 లక్షల క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయించిన ఇంజినీర్లు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఎల్లంపల్లికి భారీ వరద..
మంచిర్యాల: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టు నుంచి గోదావరికి భారీ వరద వస్తోంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు 43 గేట్లు ఓపెన్ చేసి 6.84 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు. ఆదివారం సాయంత్రం ఎస్సారెస్పీ నుంచి 4.50 లక్షల క్యూసెక్కులు, కడెం నుంచి 4 వేలు, క్యాచ్ మెంట్ ఏరియా నుంచి 1.79 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీమ్ కు 303 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు లిఫ్టింగ్ చేస్తున్నారు. ఫ్లడ్ గేట్ల ద్వారా 6.57 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది.
సింగూర్‌కు పోటెత్తుతున్న వరద
సంగారెడ్డి/పుల్కల్: సింగూరు ప్రాజెక్టుకు 95 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ఆదివారం 10 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా సింగూరులో 17 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాలని గతంలో ఆఫీసర్లు హెచ్చరించారు. దీంతో వచ్చిన వరద నీటిని ఎప్పటికప్పుడు వదిలేస్తున్నట్లు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి. భీమ్ తెలిపారు.
భద్రాచలంలో గోదావరి పరవళ్లు..
భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. శనివారం రాత్రి 10 గంటలకు నీటి ప్రవాహం 42.90 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 43 అడుగులకు చేరడంతో మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తాలిపేరు రిజర్వాయర్‌లోకి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో 15 గేట్లను ఎత్తి 16,306 క్యూసెక్కులు గోదావరిలోకి వదులుతున్నారు.