
హైదరాబాద్: మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. నిన్న కురిసిన వర్షానికి నిండిన ఒక నీటి గుంతలో పడి మూడేళ్ల బాలుడు మరణించాడు. మీర్ పెట్ ప్రాంతంలోని నందీ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 19 లో ఉన్న 20 ఫీట్ రోడ్డు ప్రక్కన కన్స్ ట్రక్షన్ చేయడానికి తీసిన పిల్లర్ గుంతలో ఓ చిన్నారి ప్రమాద వశాత్తు అందులో పడి మృత్యువాత పడ్డాడు. బాధిత కుటుంబం నల్గొండ జిల్లాలోని నాంపల్లి మండలంలో ఉన్న పసునూర్ గ్రామానికి చెందినవారు. నల్గొండ జిల్లా నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన ఆ కుటుంబం.. హైదరాబాద్‌లో మీర్ పేట్ లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. బాలుడి హఠాన్మరణంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.