
కథ, డియర్ మేఘ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న త్రిగుణ్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. నిన్న తన బర్త్ డే కావడంతో అతను నటిస్తున్న సినిమాల నుంచి స్పెషల్ అప్డేట్స్ విడుదలయ్యాయి. వాటిలో దర్శకుడు హరీష్ శంకర్ రిలీజ్ చేసిన ‘కిరాయి’ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ కూల్‌గా, లవర్ బోయ్‌లా కనిపించే త్రిగుణ్‌ని ‘కొండా’ సినిమాలో కాస్త సీరియస్ క్యారెక్టర్లో చూపిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. కొండా మురళి పాత్రలో త్రిగుణ్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. అయితే ‘కిరాయి’ లుక్ అంతకు మించి ఉందని చెప్పాలి. చింపిరి జుట్టు, గుబురు గడ్డం, బట్టలనిండా రక్తపు మరకలు, నోట్లో బీడీ, కళ్లల్లో కసి.. చూడ్డానికే చాలా క్రూయెల్‌గా కనిపిస్తున్నాడు. వీఆర్కే దర్శకత్వంలో అమూల్యరెడ్డి, నవీన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం గుంటూరు, పల్నాడు ప్రాంతాల్లో జరిగిన కిరాయి హత్యల ఆధారంగా రూపొందుతోంది. రషెస్ చూసిన వర్మ తమ సినిమా బాగుందని మెచ్చుకున్నారంటున్నాడు దర్శకుడు. కిరాయి హంతకులపై బాగా రీసెర్చ్ చేశాకే దర్శకుడు సినిమా తీశాడని, వాళ్ల జీవితాల్లోని కష్ట నష్టాలను కూడా ఇందులో చూపిస్తామని నిర్మాతలు చెబుతున్నారు.