ఖమ్మం నుంచి తుమ్మల..పాలేరులో పొంగులేటి పోటీ!

ఖమ్మం నుంచి తుమ్మల..పాలేరులో పొంగులేటి పోటీ!
  • కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లలో జోరుగా ప్రచారం
  • పాలేరు సెగ్మెంట్​లో పొంగులేటి వాల్ రైటింగ్స్

ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించగా.. కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనరల్ స్థానాల్లో ఎవరు.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఖమ్మం జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ తరఫున ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజయ్, పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. వారిపై ఖమ్మంలో కమ్మ, పాలేరులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నది. 3 జనరల్ స్థానాల్లో సర్వే జరుగుతున్నది. ఆ రిపోర్ట్ ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో పాలేరు, ఖమ్మం సెగ్మెంట్ జనరల్ కేటగిరీలో ఉన్నాయి. పాలేరు నుంచి కాంగ్రెస్​ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నుంచి  తుమ్మల నాగేశ్వర రావు బరిలో ఉంటారని తెలుస్తున్నది. పాలేరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి మండల కేంద్రంలో ఎన్నికల క్యాంప్ ఆఫీస్​ను పొంగులేటి టీమ్ సిద్ధం చేస్తున్నది.

తుమ్మలను ఒప్పించిన పార్టీ లీడర్లు!

ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు తుమ్మల ఆసక్తి చూపకపోయినా.. ఆయన్ను పార్టీ లీడర్లు ఒప్పించినట్టు తెలుస్తున్నది. దీనిపై కొందరు సన్నిహితులతో తుమ్మల చర్చించినట్టు సమాచారం. దీంతో అభ్యర్థులను పార్టీ అధికారికంగా ప్రకటించే దాకా వెయిట్ చేయాలనుకుంటున్నారు. నాలుగైదు రోజుల్లో తుమ్మల ఖమ్మం తిరిగి వచ్చే అవకాశముంది. ఉమ్మడి జిల్లాలోని తుమ్మల అనుచరులను కాంగ్రెస్​లో చేర్పించే వేదిక ఎక్కడ అనే దానిపై కూడా చర్చ జరుగుతున్నది. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడమా, లేక జిల్లా పార్టీ ఆఫీసులోనే చేరడమా, లేక ఆయా నియోజకవర్గాల్లోనే చేరికల ప్రోగ్రామ్ పెట్టడమా అనేదానిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.